అనిల్ రావిపూడి ఆవిష్క‌రించిన `ఎర్ర‌చీర` ఫ‌స్ట్ లుక్

`మ‌హాన‌టి` ఫేం బేబి సాయితేజ‌స్వీని, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలను పోషిస్తున్న చిత్రం ఎర్రచీర. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్, స్టార్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌రించారు.
 
అనంత‌రం అనీల్ రావిపూడి మాట్లాడుతూ… ` ఫ‌స్ట్ లుక్ లో హార‌ర్ కోణం క‌నిపిస్తుంది. సాయి తేజ‌స్వీని వ‌య‌సులో చిన్న‌దైనా చ‌క్క‌గా న‌టించింది. రాజా దిగ్రేట్ సినిమాలో ఆ బేబితో నే ఓ పాత్ర చేయించాల‌నుకున్నా. కానీ వ‌య‌సు త‌క్కువ‌ని ఆలోచించి ఆఛాన్స్ మిస్సయ్యాను ఇప్పుడు ఫీల‌వుతున్నా. సాయితేజ‌స్వీని భ‌విష్య‌తో మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నా. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి. రాజేంద్ర ప్ర‌సాద్ గారిని డాడి అని పిలుస్తా. నా అన్ని సినిమాల్లో ఆయ‌న ఉంటారు. స‌రిలేరు నీకెవ్వ‌రు లో ఆయ‌న ముఖ్య పాత్ర పోసిస్తున్నారు. మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో ఆయ‌న‌కు మంచి స‌న్నివేశాలున్నాయి` అని అన్నారు.
 
రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ…`సాయితేజ‌స్వీని లుక్ చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉందని పోస్ట‌ర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇలాంటి ఫీలింగ్ కొన్ని సినిమాల‌కే క‌ల్గుతుంది. చిన్న సినిమాలు మంచి విజ‌యాలు సాధిస్తేనే మాలాంటి వాళ్ల‌కు అవ‌కాశాలు వ‌స్తాయి. ఈ సినిమా త‌ప్ప‌కుండా విజయం సాధించి నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాలి. ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడిని చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంటుంది. సినిమా స‌క్సెస్ కు ఏం కావాలి? అన్న‌ది ఆయ‌న‌కు బాగా తెలుసు. ఆయ‌న‌తో నా జ‌ర్నీ చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు సుమన్‌బాబు మాట్లాడుతూ… `పోస్ట‌ర్ చూసి సినిమా హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది ఫ్యామిలీ, మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉన్న క‌థ‌. హార‌ర్ ని ట‌చ్ చేసామంతే. సినిమా బాగా వ‌స్తోంది. విజ‌యంపై ధీమాగా ఉన్నాం. ఎఫ్-2 సినిమా చూసిన త‌ర్వాత అనీల్ గారికి పెద్ద అభిమానిని అయిపోయా. ఆయ‌న చేతులు మీదుగా నా సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసుకోవ‌డం సంతోషంగా ఉంది. ఈ స‌ద‌ర్బంగా ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా` అని అన్నారు.
 
న‌టుడు క‌మ‌ల్ కామ‌రాజు మాట్లాడుతూ… ఇందులో సాయితేజ‌స్వీని తండ్రి పాత్ర పోషించా. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. అంద‌రికి న‌చ్చుతుంద‌న్నారు. సినిమా బాగా వ‌చ్చింద‌ని, మంచి విజ‌యం సాధిస్తుంద‌ని సంగీత ద‌ర్శ‌కుడు ప‌్ర‌మోద్ పులిగిల్ల‌, డైలాగ్ ర‌ట‌ర్, గోపి విమ‌ల పుత్ర తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యుటివ్ నిర్మాత తోట స‌తీష్ , గీతాసింగ్, యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు