సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ` వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే6 సినిమా విడుదలకానున్న సందర్భంగా సుమ మీడియా సమావేశంలో చెప్పిన విశేషాలు…
గొప్పగా ఫీలయ్యాను!… గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వృత్తిదర్మంగా టీవీ షోలు చేయడంతో ఖాళీ దొరకలేదు. అలాంటి టైంలో దర్శకుడు విజయ్‌గారు జయమ్మ పంచాయితీ కథ వినిపించారు. ఈ కథ రమ్యకృష్ణ, అనుష్క వంటివారిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు. ఆఖరికి నా దగ్గరకు రావడం, పెద్ద నిడివి వున్న పాత్ర కావడంతో గొప్పగా ఫీలయ్యాను. సుమ వుందటే వినోదాన్ని చూస్తారు. కానీ ఈ సినిమాలోని పాత్రను ఛాలెంజ్‌గా స్వీకరించి చేశాను. ఇందులో విలేజ్ డ్రామా వుంది. రకరకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఇది. వైజాగ్ నుంచి మూడు గంటలు పాలకొండకు జర్నీ చేయాలి. కాబట్టి ఇంటిలో మా పిల్లల అనుమతి తీసుకున్నా. ఆ తర్వాత నాకు నేను కొత్తదనం కోసం ప్రయత్నించాలని ఆలోచించాను. కొంత రిస్క్, భయం వున్నా కొత్తగా నా టాలెంట్‌ను చూపించాలని చేసిన సినిమానే ఇది.
చాలా కొత్తగా అనిపించాయి !… నేను థియేటర్ ఆర్టిస్టుగా అప్పట్లో కొన్ని డ్రామాలు చేశాను. అవన్నీ మిస్ అయ్యాను అనిపించింది. దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ తీసుకురావడం, డబ్బింగ్ లేకుండా సింక్ సౌండ్‌తో చేయడం, శ్రీకాకుళం యాస ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాయి. యాంకర్‌గా తప్పుపట్టకుండా చూసుకుంటాను. కానీ తెలీని యాసలో మాట్లాడి మెప్పించం కష్టమే. ఇందులో నేను ఫోన్ పట్టుకునే సీన్ కూడా జయమ్మలాగానే వుండాలని దర్శకుడు చెప్పడం, యాసకోసం డైరెక్షన్ డిపార్టమెంట్ సలహాలు తీసుకోవడం, తోటి ఆర్టిస్టుల ద్వారా యాసను పట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుని చేసిన సినిమా ఇది. ఇప్పటివరకు చాలా సినిమాల్లో శ్రీకాకుళం యాసను ఓవర్‌గా చూపించినట్లు వుండేది. కానీ ఇందులో సహజంగా ఎలా మాట్లాడతారో అలా చూపించారు. ఆ యాసలో మాట్లాడి మెప్పించే ప్రయత్నం చేశాను.
నా పాత్రే కనిపిస్తుంది!… ప్రధాన పాత్ర చేయడం వల్ల కథంతా నా భుజాలపై వుందనిపిస్తుంది. కానీ కథలో పోనుపోను అని పాత్రలతో లీనమైపోతారు. అది దర్శకుడు చేసిన మేజిక్. నా పాత్రే కనిపిస్తుంది. సుమ కనిపించదు. దర్శకుడు శ్రీకాకుళం వాస్తవ్యుడు కాబట్టి అక్కడ తన కుటుంబీకులతో మాట్లాడుతున్నప్పుడు, వారు చేపల మార్కెట్లో వున్నప్పుడూ.. ఇలా రకరకాల సంఘటనలను ఫోన్లో షూట్ చేసినాకు పంపారు. అవన్నీ నేను ఇన్‌పుట్స్‌గా తీసుకుని జయమ్మ పాత్రకు మలుచుకున్నాను.
నేను సెలబ్రిటీ అయ్యాక ఇన్ని రోజులు విలేజ్‌లో వుండడం జరగలేదు. షూటింగ్ గేప్‌లో అక్కడి ప్రజలతో ఇంటరాక్ట్ కావడం నాకు చాలా ఉపయోగపడింది. పాలకొండ అనే సుందరమైన ప్రదేశాలు, దట్టమైన అడవిని ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూపించలేదు. కేరళ తరహాలో జలపాతాలు, లోయలు, కొండలు ఇక్కడ వున్నాయి. ఈ సినిమా తర్వాత అన్నీ వెలుగులోకి వస్తాయి.
ధైర్యంగా ముందడుగు… ఈ సినిమాకు కేటాయించిన టైంలో ఎన్నో టీవీ షోలు చేసి సంపాదించవచ్చు. కానీ నా స్టామినాను సినిమా ద్వారా అందరికీ తెలియజేయాలంటే ఇదే సరైన నిర్ణయం. అందుకే ధైర్యంగా ముందడుగు వేశాను.
నటుడిగా అబ్బాయి రోషన్ లాంచ్… ఏదైనా వాడి నిర్ణయమే. మా ప్రమేయం సినిమా కథలో ఏమీ వుండదు. చిన్నతనంనుంచి నటుడు అవ్వాలనే కోరిక వుంది. త్వరలో మా వాడి గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తాను అని అన్నారు.