అలాంటి చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నా, దర్శక నిర్మాతలు సంకోచిస్తున్నారు… అని అంటోంది అమలా పాల్. ప్రియుడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ, మేనమామతో అక్రమ సంబంధం సాగించే వివాదాస్పద పాత్ర ‘సింధూ సమవెళి’ లో నటించి …అమలాపాల్ అంటే ఏమిటో సినీ పరిశ్రమకు చాటి చెప్పిన సంచలన నటి అమలాపాల్. వివాదాలకు భయపడకుండా, విమర్శలను పట్టించుకోకుండా, తాను కోరుకున్న బాటలో ధైర్యంగా దూసుకుపోతున్న నటి అమలాపాల్. ఆ సమయంలో మహిళా సంఘాలతో పాటు పలువురి వ్యతిరేకతకు గురైనా భయపడలేదు. ప్రేమ, అందాలారబోత, కుటుంబ కథా పాత్రలు చాలా తక్కువ కాలంలోనే చేసేసిన అమలాపాల్ ఆ తర్వాతి కాలంలో దర్శకుడు విజయ్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఈ కేరళ కుట్టి ‘మళ్లీ నటనకు రెడీ’ అంటూ వచ్చేసింది.
ఇటీవల నటించిన ‘తిరుట్టుప్పయలే–2’ చిత్రంలో అందాలమోత మోగించి మరోసారి తన రూటే సపరేట్ అని అందరికి అర్థమయ్యేలా చేసింది. తాజాగా అరవిందస్వామికి జంటగా ఒక పిల్లకు తల్లిగా నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ చిత్రం జనవరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అమలాపాల్ చాలా గ్యాప్ తరువాత తెలుగులోనూ రీఎంట్రీ అవుతోంది. ఇదో చర్చనీయాంశ కథా చిత్రం అట.
ఇటీవల అమలాపాల్ మాట్లాడుతూ… ‘ఇక్కడ ఛాలెంజింగ్ కథా చిత్రాలను తెరకెక్కించడానికి జంకుతున్నారు. వైవిధ్యభరిత కథలతో చిత్రాలు చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. అలాంటి చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నా, దర్శక నిర్మాతలు సంకోచిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలంటే ఇష్టం అని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారు. అక్కడ వాస్తవ సంఘటనతో చిత్రాలు చేస్తున్నారు. మన సమాజంలోనూ ఎన్నో ఆశ్చర్యకరమైనవి, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి.అలాంటి వాటిని ఇతివృత్తంగా తీసుకుని చిత్రాలను వినూత్నంగా తెరకెక్కించవచ్చు. అలా చేయడానికి మన వాళ్లు సాహసించలేకపోతున్నారు. ఇటీవల స్త్రీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పలు చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అయినా ఇంకా హీరోయిన్లు హీరోల చుట్టూ తిరిగి ప్రేమించడం, పాటలు పాడడం లాంటి మూస పాత్రలకే హీరోయిన్లను పరిమితం చేస్తున్నారు. ఒక వేళ స్త్రీ ఇతివృత్తాలతో చిత్రాలు చేసిన వారిని నేరస్తులు గానో, గ్లామరస్గానో చూపిస్తున్నారు.ఈ విధానం మారాలి. హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రాలనూ విభిన్న కథలతో చేయవచ్చు’ అన్నారు.