వలసకార్మికులతో తన అనుభవాలను శాశ్వతంగా తెలియజేసేలా పుస్తకం రూపంలో తీసుకురావాలని నిర్ణయించుకున్నానని సోనూసూద్ చెప్పారు..సోనూసూద్ రచయితగా కొత్త అవతారం ఎత్తనున్నారు. కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో వేలాదిమంది వలసకార్మికులను వారి స్వగ్రామాలకు పంపించేందుకు సహాయం చేసిన తన అనుభవాలతో ఒక పుస్తకం రాసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చారు. ‘‘గత మూడున్నర నెలలు నాకు జీవితాన్ని మార్చే అనుభవాలు మిగిలాయి…వలసకార్మికులతో రోజుకు 16 నుంచి 18 గంటలు గడుపుతూ వారి బాధలను పంచుకున్నాను.వారు ఇంటికి తిరిగి వెళ్లేటపుడు చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండింది. వలసకార్మికుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం, వారి కళ్లలో ఆనందం నా జీవితంలో అతి గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. చివరి వలసకార్మికుడిని కూడా ఇంటికి పంపించే వరకు ఈ పని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశాను ’’అని సోనూసూద్ వివరించారు. తాను వలసకార్మికులకు సహాయపడటం కోసం ముంబై నగరానికి వచ్చానని నమ్ముతున్నానని ..వలసకార్మికులకు సహాయం చేయడంలో నన్ను ఒక ఉపకరణంగా మార్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని సోనూసూద్ చెప్పారు. ముంబైలో నా హృదయ స్పందనలను అక్షరబద్ధం చేస్తానని సోనూ చెప్పారు. యూపీ, బీహార్, జార్ఖండ్, అసోం, ఉత్తరాఖండ్.. ఇతర రాష్ట్రాల గ్రామాల్లోనూ తాను.. వలసకార్మికులైన కొత్త స్నేహితులను గుర్తించానని, వలసకార్మికులతో సంబంధాలు ఏర్పడ్డాయని సోనూ చెప్పారు. వలసకార్మికులతో తన అనుభవాలను శాశ్వతంగా గుర్తుంచుకునేలా ఆ కథలను ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని నిర్ణయించుకున్నానని సోనూసూద్ వివరించారు.తాను రాసే ఈ పుస్తకాన్ని ‘పెంగ్విన్ రాండమ్ హౌస్’ ఇండియా ప్రచురిస్తుందని సోనూసూద్ చెప్పారు.
నా బయోపిక్ తీస్తే నా పాత్రను నేనే పోషిస్తా!
వేల మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపించి రీల్ విలన్ సోనూసూద్ ప్రజల హృదయాల్లో రియల్ హీరోగా నిలిచిపోయాడు. తాజాగా సోనూసూద్‌పై ఓ సినిమా కూడా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన సోనూ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. సోనూ చేసిన సేవలు, అతడి సహాయం పొందిన వారి వివరాలు, లెక్కలు అన్నీ రికార్డయి ఉన్నాయి. దీంతో సోనూ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాలని బాలీవుడ్లో కొందరు దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట! ఇదే విషయంపై సోనూ స్పందిస్తూ.. ”నిజంగా నా బయోపిక్ తీస్తే అందులో నా పాత్రను నేనే పోషిస్తా. ఎందుకంటే నా జీవితంలో ఎదురైన అనుభవాలు నాకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తాయి.” అని అంటున్నాడు. అయితే సోనూసూద్ పుస్తకం రాసిన తర్వాత సినిమాను తెరకెక్కిస్తారా? రెండూ ఒకేసారి జరుగుతాయా అనేది వేచి చూడాలి.
ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక అండ
సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. లాక్డౌన్ వల్ల వందల కిలోమీటర్లు నడిచి గాయపడి, మరణించిన 400లకు పైగా వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి సోనూసూద్ సిద్ధమయ్యారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి మద్దతుగా నిలవడం బాధ్యతగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో మాట్లాడి.. ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, వారికి సంబంధించిన సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. వారందరికీ ఆర్థికంగా అండగా ఉంటానని సోమవారం సోనూ ప్రకటించారు.
మహారాష్ట్ర పోలీసులకు 25,000 ఫేస్ సీల్డ్స్
సోనూసుద్ ఇప్పటివరకూ వలస కార్మికులకు చేతనైన సాయం చేసాడు. ఇప్పుడు సోనూసుద్ కరోనా కష్ట కాలంలో రాత్రిపగలూ తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తయారుచేసిన 25,000 ఫేస్ సీల్డ్స్ను సోనూసుద్ సదరు శాఖకు అందజేశాడు.