డబ్బు సంపాదనకే వచ్చినా.. ఆ తర్వాత ప్రేమలో పడ్డా!

డబ్బులు సంపాదించడానికే చిత్రసీమకు వచ్చాను. ఇక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని తెలుసు. కానీ తర్వాత ఈ వృత్తితో ప్రేమలో పడ్డాను. చిత్రసీమ నాకు మానసికంగా, సృజనాత్మకంగా ఓ అద్భుతమైన వేదికగా అనిపించింది” అని సోనాలీ బింద్రే చెప్పారు. ఆమె బాలీవుడ్ దర్శక నిర్మాత గోల్డీ బెహల్ ని వివాహం చేసుకుంది. మహేష్ బాబు తో ‘మురారి’, చిరంజీవి తో ‘ఇంద్ర’, నాగార్జునతో ‘మన్మధుడు’, కృష్ణ వంశీ ‘ఖడ్గం’ వంటి విజయవంతమైన తెలుగు సినిమాల్లో నటించిన సోనాలీ ఇటీవల క్యాన్సర్‌ తో బాధ పడింది.
 
‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’కు ఆమె హాజరై ఈ ఫెస్టివల్‌లో ‘సోనాలీ బుక్‌ క్లబ్‌’ పేరితో ఓ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా సోనాలీ మాట్లాడుతూ …
”మా నాన్నగారు నిజాయితీ గల ప్రభుత్వం అధికారి. అందువల్ల నిత్యం బదిలీలు ఉండేవి. దీంతో ఒక చోట నుంచి మరో చోటకు మారడానికే జీతం మొత్తం ఖర్చు అయిపోయేది. నా చదువుకు కూడా డబ్బులు పంపలేని పరిస్థితి . అందుకే నేను 12వ తరగతి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పట్లో మా కుటుంబం ముంబాయి వచ్చింది. చాలా చోట్ల పని చేయాలని చూశాను. కానీ కుదిరేది కాదు. ఒక్క చోట అవకాశం దొరికింది. అప్పట్లో ప్రకటనలు ఎక్కువగా మారుస్తూ ఉండేవారు. అందుల్లో మోడల్స్‌ను తీసుకునే వారు కాదు. వారి స్థానంలో నాకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఐఏఎస్‌ చదువుతానని ఏకంగా మూడేళ్ల పాటు మా నాన్న గారిని అడిగాను. కానీ చేయలేకపోయా” అని చెప్పారు సోనాలి.
 
# నా చెల్లెళ్ళ కంటే పుస్తకాలే నాకు స్నేహితుల్లా మారాయి. నేనెప్పుడూ ప్రజలకు ఉపయోగపడని సినిమాలు చేయలేదు. మహారాష్ట్రకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాను. నాకు సినిమాల్లోకి అవకాశం వచ్చినప్పుడు ఓ కొత్త గ్రహంలోకి వచ్చినట్టు అనిపించింది.
 
# సినిమారంగం లో  స్టార్స్‌ మేథోసామర్థ్యాన్ని ఎవ్వరూ ఆరా తీయరు. ఆ స్టార్స్‌ తమ నటనతో అలరించారా? లేదా? అన్నదే చూస్తారు. బాలీవుడ్‌లో ఎంతోమంది స్నేహితులను, కుటుంబ సభ్యులను సంపాదించుకున్నా. బాలీవుడ్‌కు నేను ఎంతో రుణపడి ఉన్నా. నా జీవితంలో జరిగిన అతి పెద్ద అద్భుతాల్లో ఇదొకటి. 
 
 ఆ పుస్తకం నాకెంతో బలాన్నిచ్చింది!
నాకు క్యాన్సర్‌ అని తెలిసాక షాక్‌కు గురయ్యా. ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో అనేక పుకార్లు పుట్టుకొస్తాయని ఊహించి క్యాన్సర్‌ విషయాన్ని నేనే సోషల్‌ మీడియాలో ముందుగానే షేర్‌ చేశాను. ఈ విషయం తెలిసిన తర్వాత పట్టణ, గ్రామీణ వాసులు చాలా మంది, నా అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. నాకు మద్దతుగా నిలిచి ధైర్యాన్నిచ్చారు. అన్ని రకాల వయసుల వాళ్లూ అందులో ఉన్నారు. నేను ఒంటరిని కాదని అప్పుడే అనిపించింది. చాలా మంది ఈ వ్యాధితో నాలా బాధపడ్డ వారు ఉన్నారు. కానీ ఆ సమయంలో నేను ఏం చేయాలో నా భర్త చెప్పి ఎంతో ధైర్యాన్నిచ్చారు. నేను న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నప్పుడు ‘ఏ జెంటల్‌మ్యాన్‌ ఇన్‌ మాస్కో’ (2016లో అమోర్‌ తోవల్‌ రాసిన నవల) పుస్తకం నాకెంతో బలాన్నిచ్చింది.