తెలుగు చలనచిత్ర సంగీత పరిశ్రమకు చెందిన నేపథ్య గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, వాయిద్యకారులు సభ్యులుగా ఉండే సంస్థ ‘సినీ మ్యుజీషియన్స్ యూనియన్’ (సి.ఎం.యు). ఈ ప్రతిష్టాత్మకమైన యూనియన్‌కి బుధవారం జరిగిన కార్యవర్గ ఎన్నికలలో అధ్యక్షురాలిగా ప్రముఖ నేపథ్య గాయని, ‘సింగింగ్ స్టార్’ విజయలక్ష్మి ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా ఆర్.పి. పట్నాయక్, అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా మణిశర్మ, ఉపాధ్యక్షులుగా పాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శిగా లీనస్, సంయుక్త కార్యదర్శిగా కౌసల్య, కోశాధికారిగా గాయకుడు రమణ, సలహాదారుగా రామాచారి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ”నేపథ్య గాయనిగా వివిధ చిత్రాలలో 300కు పైగా పాటలు పాడి, చలనచిత్ర సంగీత రంగంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నాకు, అదే శాఖకు సంబంధించిన ప్రతిష్టాత్మక యూనియన్‌కు అధ్యక్షురాలిగా ఎంపికవడం చెప్పలేని సంతోషాన్ని కలిగిస్తోంది. ఒక మహిళ ఈ యూనియన్‌కు అధ్యక్షురాలవడం ఇదే ప్రథమం. సభ్యులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వందశాతం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. పేద, వృద్ధ కళాకారులకి సహాయపడేలా ఓ మూలనిధిని ఏర్పాటు చేయడం, కళాకారులందరికీ ఆరోగ్య బీమా కార్డులు, ఇళ్ళ స్థలాలు వచ్చేలా చేయడం, స్థానిక కళాకారులకి ఎక్కువ పని దొరికేలా చేయడం మా ముందున్న ప్రధాన లక్ష్యాలు. ఇవి కార్యరూపం దాల్చడానికి మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తాం” అని అన్నారు.