‘ఈ సారి పుట్టిన రోజుకి చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే డాన్స్ చేశా. ఈ ఏడాది నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చేవే. నేనెప్పుడూ నడవని కొత్త దారిలో ప్రయాణిస్తూ… నాకు నచ్చినట్టు వెళ్తున్నా’ అని అంటోంది శృతి హాసన్. రెండేండ్ల క్రితం పవన్ కళ్యాణ్‌తో ‘కాటమరాయుడు’లో నటించిన శృతి హాసన్ దాదాపు మూడేండ్ల గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తోంది . ప్రేమలో పడి కొంత కాలం నటనకు దూరం అయినా.. తాను ఆ సమయంలో ఖాళీగా మాత్రం లేనని, తనకు ఇష్టమైన సంగీత ఆల్బమ్స్ రూపొందిస్తూ బిజీగానే ఉన్నానని చెప్పు కొచ్చింది. అయితే ప్రేమ బ్రేకప్ అవ్వడంతో ఇటీవల మళ్లీ నటనపై దృష్టి సారించింది. తాజాగా ఆమె లండన్‌లో తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. లండన్ వీధుల్లో డాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా శృతి స్పందిస్తూ…
“నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ సారి పుట్టిన రోజుకి చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే డాన్స్ చేశా. ఇలాంటి ఆనందకరమైన జీవితానికి సమయం పట్టవచ్చు, అందుకు శ్రమించాలి. ఎలాంటి జీవితం కావాలి, జీవితాన్ని ఎలా చూడాలనుకుంటున్నారన్నది మీ ఆలోచనల్లో ఉంటుంది. అందుకే ఈ డాన్స్ నా హృదయంలో నుంచి వచ్చింది. ఇప్పుడు చాలా స్వేచ్ఛగా నా జర్నీ సాగుతుంది. అది నా పనిని భిన్నంగా మారుస్తుంది” అని తెలిపింది. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో రవితేజతో కలిసి ‘క్రాక్’ చిత్రంతోపాటు తమిళంలో విజయ్‌సేతుపతి ‘లాభమ్’, హిందీలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
నాకు రాజకీయ పరిజ్ఞానం లేదు!
శ్రుతిహాసన్ ప్రేమలో పడి కొంత కాలం నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ సమయంలో ఖాళీగా మాత్రం లేనని, తనకు ఇష్టమైన సంగీత ఆల్బమ్స్ రూపొందిస్తూ బిజీగానే ఉన్నానని చెప్పు కొచ్చింది. అయితే ప్రేమ బ్రేకప్ అవ్వడంతో ఇటీవల మళ్లీ నటనపై దృష్టి సారించింది. అంతే కాదు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించేస్తోంది కూడా.హిందీలో కాజోల్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరిన్ని చిత్రాల్లో నటించే విషయమై కథలు వింటున్నట్లు చెప్పింది. మొత్తం మీద నటిగా ఇప్పుడు బిజీగా ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్ మీడియాతో మాట్లాడుతూ…
ప్రధానంగా తన తండ్రి కమల్ హసన్ రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఎప్పుడూ తండ్రికి తన మద్దతు ఉంటుందని చెప్పింది. అయితే తనకు రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పింది. రాజకీయాల్లోకి వస్తానా? అన్నది చెప్పలేనని అంది. తాను ఇతరుల పనితో పోల్చుకోవడానికి ఇష్టపడనని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను ఏం సాధించగలనో ఆ పనే చేస్తానని పేర్కొంది. ఇక తన తండ్రి కమల్ హసన్ గురించి చెప్పాలంటే.. ఆయనకు చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ అని తెలిపింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది. కమల్‌హాసన్, రజనీకాంత్ కలుస్తారా? అన్న ప్రశ్నకు చెప్పలేనని తెలిపింది.