శృతిహాసన్… “మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రయాణాలు, హృదయాన్ని అర్థం చేసుకునే మిత్రులు, నోరూరించే భోజనం, శ్రావ్యమైన సంగీతం…తన జీవితంలో ఇవన్నీ ఉంటే చాలకున్నానని, అదృష్టం కొద్ది అన్నింటిని పొందా”నని చెప్పింది శృతిహాసన్. ఒకానొక సమయంలో నా జీవితం ఎటువైపు వెళుతుందో తెలిసేది కాదు. అయితే విజయం ఏమిటో, దాని తాలూకు కిక్ ఏమిటో అవగాహన మాత్రం వుండేది. అందుకే కెరీర్‌ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. దూరమైన తర్వాతే నిజమైన స్నేహితులెవరో తెలిసింది. నన్ను నేను ఇష్టపడ్డాకే నిజమైన ప్రేమంటే ఏమిటో తెలిసింది. నన్ను ఎంతగానో ఇష్టపడుతున్న మిత్రులకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. వృత్తిలో బిజీగా ఉండటం నాకు ఇష్టం. దానివల్ల చిన్న చిన్న సమస్యల్ని మర్చిపోతాం. ప్రతిరోజు కొత్త అనుభవాన్ని చూస్తాం అని చెప్పింది. ‘కాటమరాయుడు’ తర్వాత తెలుగులో ఏ సినిమాలో నటించలేదు శృతిహాసన్. ప్రస్తుతం మహేష్‌మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ హిందీ సినిమాలో నటిస్తున్నది.
ఏకాగ్రత … సమయస్ఫూర్తి కావాలి !
‘కొత్త విషయాలు నేర్చుకోవడంలో నేనెప్పుడూ ముందుంటా. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండకపోతే మనం ఎదగలేం’’ అని అంటున్నారు శ్రుతీ హాసన్. తాజాగా ఆమె ఓ టీవీ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్వవహరిస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ… ‘‘టీవీ షో హోస్ట్ చేయడం ప్రత్యేకమైన కళ. దీనికి ఏకాగ్రత కావాలని నాకు ముందు తెలియదు. ఏకాగ్రత మాత్రమే కాదు… సమయస్ఫూర్తి కావాలి. రకరకాల వ్యక్తిత్వాల గురించి రోజూ ప్రత్యేకంగా తెలుసుకోవాలి. దీనివల్ల మనుషుల్లోని భిన్న పార్శ్వాలను అర్థం చేసుకోవచ్చు. అందుకే టీవీ షో హోస్టింగ్ నాకు చాలా మంచి అనుభవాన్నిస్తోందని అనుకుంటున్నా. నా షో కోసం గంట సమయం కేటాయించి వచ్చే అతిథులు నాతో మాట్లాడటానికి కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నారా? లేదా? అనేది కీలకం. మామూలుగా నేను అంత సోషల్ పర్సన్‌ని కాదు. ఎదుటివారితో గంటల సేపు మాట్లాడటం నాకు చేతకాదు. అవన్నీ ఎలా సాధ్యమవుతాయో ఇప్పుడు తెలుసుకుంటున్నా. ఎదుటివారితో ఆసక్తికరమైన సంభాషణ సాగించడానికి ప్రయత్నిస్తున్నా’’ అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలున్నాయా? అని అడగ్గా ‘‘నాకు రాజకీయాల గురించి తెలివితేటలు లేవు. అనుభవం అసలే లేదు. రాజకీయ ప్రవేశం గురించి నేనేమీ స్పందించను’’ అని అన్నారు.