శృతి హాసన్ స్పీడ్ పెంచింది.శృతి హాసన్ కొన్నాళ్ళపాటు మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరు అతి త్వరలో పెళ్ళి చేసుకోనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే అనుకోకుండా వీరి ప్రేమకి బ్రేక్ పడింది. ఇటీవల మైకేల్ “దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాలలో నడవాల్సి వస్తుంది. కాని ఈ యంగ్ లేడీ ఎప్పటికి నా బెస్ట్ ఫ్రెండే. నువ్వు నాకు ఫ్రెండ్‌గా దొరకడం నా అదృష్టం. ఆమెకి జీవితాంతం స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను . లవ్ యూ గాల్” అని ట్వీట్ పోస్ట్ చేశాడు. అయితే రెండేళ్ళపాటు సినిమాలకి దూరంగా ఉన్న శృతి హాసన్ ‘సూపర్ డీలక్స్’తో మంచి హిట్ కొట్టిన విజయ్ సేతుపతి సరసన నటించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ‘పురంపొక్కు ఎంగిర పొతువుదమై’ ఫేం ఎస్పీ జననథన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘లాభం’ అనే టైటిల్‌తో దేశంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఈ చిత్రంలో వివరించనున్నట్టు సమాచారం.
తెలుగులోను శృతి హాసన్ స్పీడ్ పెంచింది. కొరటాల శివ- చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుందని అంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన శృతి హాసన్ ఇప్పుడు చిరంజీవి తోను కలిసి పని చేయనుండడం విశేషం. ఇదిలా ఉంటే, శృతి చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ రవితేజ సరసన నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని,రవితేజ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో కథానాయికగా శృతిని ఎంపిక చేశారు. గతంలో రవితేజ, శృతి జంటగా ‘బలుపు’ సినిమా వచ్చిన విషయం విదితమే. ఆ సినిమాకి కూడా గోపీచంద్ మలినేని దర్శకుడు కావడం విశేషం. శృతి హాసన్ చివరగా తెలుగులో ‘కాటమరాయుడు’లో మెరిసింది. ప్రస్తుతం హిందీలో ‘పవర్’, తమిళంలో ‘లాబమ్’ చిత్రాల్లో నటిస్తూ శృతి బిజీగా ఉంది.
ఆ సాంగ్ మీకూ నచ్చుతుంది
శృతి హాసన్ మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన గాయని అనే విషయం తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక ఆల్బమ్స్‌లోనే కాదు, సినిమాల్లోనూ పాటలు పాడుతూ శ్రోతలతోపాటు ప్రేక్షకులనూ మెప్పిస్తోంది. తాజాగా తమన్నా కోసం ఓ పాట పాడిందట. తమన్నా హిందీలో ‘ఖామోషి’ చిత్రంలో నటిస్తుంది. హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా హీరోగా నటిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ షమిర్ టాండన్ ఆధ్వర్యంలో శృతి పాడిన టైటిల్ సాంగ్ అద్భుతంగా వచ్చిందని, ఆ టైటిల్ సాంగ్ మీకూ నచ్చుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతుంది.