తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించిన సౌత్ స్టార్ హీరోయిన్ రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ ను పెళ్లాడారు. వీరి ప్రేమ వ్యవహారం కొంతకాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఇద్దరూ వివాహబంధంతో ఒకటి కాబోతున్నారనీ ఇటీవల పుకార్లు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని శ్రియ తల్లి ఖండించారు కూడా. ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని శ్రియ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ శ్రియ మాటలు అబద్ధమై.. పుకార్లు నిజమయ్యాయి. శ్రియ పెళ్లి అయిపోయిందనే వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ నెల 12వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియుడితో శ్రియ పెళ్లి జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొచ్చీవ్‌తో శ్రియ చాలా కాలంగా ప్రేమలో ఉంది.
ఈ నెలలోనే ఉదయ్‌పూర్‌లో శ్రియ పెళ్లి అని గతంలోనే వార్తలు వచ్చాయి.అయితే రహస్యంగా ఈ నెల 12వ తేదీన ముంబైలోని ఇంట్లోనే శ్రియ పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగిందట. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించినట్టు సమాచారం. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లిలో శ్రియ పింక్ ఔట్ఫిట్లో మెరిసిపోయినట్టు సన్నిహితులు తెలిపారు. ఎన్ని పుకార్లు వచ్చినా వాటన్నింటినీ కొట్టిపారేస్తూ రహస్య వివాహం చేసుకుని అభిమానులకు శ్రియ షాక్ ఇచ్చారు.పెళ్లికి ముందు సంగీత్ కార్యక్రమాన్ని 11వ తేదీన నిర్వహించినట్టు సమాచారం.