శ్రియ శరన్… నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకున్న తారల్లో శ్రియ ఒకరు. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాది భాషల్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే ప్రేమించిన ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈమెకు చిత్రాలు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. కోలీవుడ్‌లో ‘నరకాసురన్’ అనే చిత్రం చేస్తోంది. అరవిందస్వామి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియ ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించినట్లు సమాచారం.”చాలా గ్యాప్ తరువాత ‘నరకాసురన్’ చిత్రంలో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుండటం సంతోషంగా ఉంది”… అని అంటోంది శ్రియ
వరుస పరాజయాలతో కెరీర్ ముగిసిపోతుందనుకున్న తరుణంలో అభినయానికి ప్రాధాన్యమున్న ప్రయోగాత్మక పాత్రలతో మళ్లీ పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నది ఈ సొగసరి. సృజనాత్మకతతో ముడిపడిన చిత్రసీమలో జయాపజయాల్ని ముందుగానే ఊహించడమనేది అసాధ్యమని చెబుతున్నది శ్రియ.
“పద్దెనిమిదేళ్ల ప్రయాణంలో కొన్ని సినిమాలు అనవసరంగా చేశాను. అవి గుర్తొచ్చినప్పుడల్లా మనసులో తెలియని బాధ కలుగుతుంది. వాటిని మంచి సినిమాలే అని నమ్మి చేశాను. కానీ అవి నా కెరీర్‌పై చాలా ప్రభావాన్ని చూపించాయి.వాటివల్ల ఒకానొకదశలో సినిమాలకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ప్రతికూల ఫలితాల్ని చూసి ఏ రోజు అధైర్యపడలేదు. విమర్శల్ని భరిస్తూ ఓపికగా మంచిరోజు కోసం ఎదురుచూశాను. పూర్తిగా దర్శకుల్ని నమ్మే నేను సినిమాలు చేస్తాను. ఈ నిర్ణయాలు కొన్నిసార్లు సానుకూల ఫలితాల్ని ఇస్తే మరికొన్ని సార్లు ప్రతికూలంగా తయారవుతాయి. సుదీర్ఘ అనుభవమున్నప్పటికి కథల ఎంపికలో నేను ఇప్పటికి చాలా వీక్. సినిమాను అంగీకరించడానికి చాలా సమయం తీసుకుంటాను” అని చెప్పింది.
డాన్స్ కి సంబంధించిన చిత్రాల్లో నటించాలని …
నేనిప్పటి వరకూ నటించిన చిత్రాలన్నింటి కంటే నా మనసుకు నచ్చిన చిత్రం ‘శివాజీ’. అందులో రజనీకాంత్ సరసన నటించడం నా భ్యాగం. రజనీకాంత్‌తో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకూ సమానంగా చూసే మానవత్వం కలిగిన వ్యక్తి ఆయన. రజనీకాంత్ వంటి నటుడిని నా జీవితంలో చూడలేదు. ‘శివాజీ’ చిత్ర షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అయితే నాకు డాన్స్ అంటే ఆసక్తి. దానికి సంబంధించిన చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నాను. అలాంటి చిత్రాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అని శ్రియ పేర్కొంది.
ప్రస్తుతం శ్రియ తెలుగులో ‘వీరభోగవసంతరాయలు’ చిత్రాన్ని చేస్తున్నది.కోలీవుడ్‌లో ‘నరకాసురన్’ మినహా మరో అవకాశం లేదు.