శ్రద్ధా కపూర్ తొలిసారి నటిస్తున్న బయోపిక్ ‘హసీనా పార్కర్’. ముంబాయి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాత్రలో సహజత్వం కోసం, పాత్రను బాగా పండించడం కోసం శ్రద్ధా బాగా కష్టపడిందట. హసీనా నివసించిన ముంబయిలోని నాగ్పాడా ప్రాంతంలో కొన్ని రోజులు అక్కడే ఉండి హసీనా బతికున్నప్పుడు ఆమెను చూసిన వారిని, ఆమెతో కలిసి మాట్లాడిన వారిని, ఆమె కుటుంబీకులను కలిసి శ్రద్దా మాట్లాడిందట. హసీనా ఎలా ఉండేది? ఎలా ప్రవర్తించేదనే విషయాలపై అందరి దగ్గర్నుంచి ఇన్పుట్స్ తీసుకుందట. అంతేకాదు ఆమె వాడిన కళ్లద్దాలు, లిప్‌స్టిక్‌లు కూడా గుర్తుగా ఉంచుకోవడం కోసం తీసుకెళ్లిందని.. ఒక్కమాటలో చెప్పాలంటే… ఈచిత్రంలో శ్రద్ధా నటించలేదు.. జీవించిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దావూద్ పాత్రలో శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటించిన ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రద్ధా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఎవరైనా చెబితే నవ్వి ఊరుకుంటా !
తన సోదరి శ్రద్ధాకపూర్‌పై వస్తున్న రూమర్లను పట్టించుకోనని ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ కపూర్ చెప్పారు. ఎవరైనా చెబితే నవ్వి ఊరుకుంటానని తెలిపారు. మిగితా ఎవరికీ తెలియనన్ని విషయాలు తన సోదరి గురించి తనకు మాత్రమే తెలుసని చెప్పారు. తన సోదరిపై తనకు అధికారం ఉన్నట్లుగా వ్యవహరిస్తానని అదే సమయంలో తామిద్దరం చాలా సన్నిహిత మిత్రుల మాదిరిగా ఉంటూ అన్ని విషయాలు చర్చించుకుంటామని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా ‘హసీనా పార్కర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సిద్ధాంత్ దావూద్ ఇబ్రహీంగా నటిస్తుండగా.. శ్రద్ధా అతడి సోదరి హసీనా పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు….. ముఖ్యంగా ఫర్హాన్ అక్తర్‌తో శ్రద్ధా చాలా చనువుగా ఉంటున్నారని, వారిద్దరి మధ్య సంబంధాలు బయటకు చెప్పలేనంతగా గాఢంగా మారాయంటూ రూమర్లు వినిపిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావించగా.. ఆయన నవ్వి వదిలేశారు. ‘మేం చాలా మంచి మిత్రులం. ఒకరి సలహాను ఒకరం పాటిస్తాం. మా ఇద్దరి మధ్య ఎలాంటి అహంభావ సమస్యలు ఉండవు. మేం ఎల్లప్పుడు ఒకరికోసం ఒకరం ఉంటాం. శ్రద్ధా గురించి బయటవారికంటే నాకే బాగా తెలుసు. నిజమేమిటో కూడా నాకే తెలుసు. అందుకే ఇలాంటి కథలు వినిపిస్తున్నప్పుడు నవ్వి ఊరుకుంటాను. వదంతులు అనేవి ఎప్పటికీ వదంతులుగానే ఉండిపోతాయి. వాటిని మనం ఏం చేయలేం’ అని చెప్పారు.