‘తొలిసారి పోలీస్ పాత్రలో నటించడం ఎగ్జైటింగ్‌గా ఉంది. దేశం కోసం పోలీసులు త్యాగాలు సైతం చేస్తారు. వారికి ప్రతినిధిగా నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నా’ అని శ్రద్ధా కపూర్ అన్నారు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంలో శ్రద్ధా నటించారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు సుజీత్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన కొత్త టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యింది. ఇందులో పోలీస్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన శ్రద్ధాకి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ సందర్భంగా శ్రద్ధా మాట్లాడుతూ… ‘మొదటిసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించినందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇది ప్రత్యేక హక్కుగా భావిస్తున్నా. ఎందుకంటే పోలీసులు దేశం కోసం పోరాడతారు. త్యాగాలు సైతం చేస్తారు. వారిని రిప్రజెంట్ చేసే పాత్రలో నటించడం గౌరవంగా ఫీల్ అవుతున్నా. ప్రయోగాత్మక పాత్రలు, విభిన్న పాత్రలు పోషించేందుకు ప్రయత్నిస్తున్నా. అందులో భాగంగా ‘సాహో’లోని పోలీస్ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా నటించడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. తుపాకి పట్టుకోవడం కొత్త అనుభవం. అది వాడేటప్పుడు నా శరీరాన్ని మరింత పొడిగించినట్టుగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా కోసం నేనూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నా’ అని తెలిపింది. ‘సాహో’తోపాటు ‘చిచ్చోర్’, ‘స్ట్రీట్ డాన్సర్’ చిత్రాల్లోనూ శ్రద్ధా నటిస్తూ బిజీగా ఉంది.