సినీవినోదం రేటింగ్ : 3/5
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… ముగ్గురు స్నేహితులు.. అందులో మొదటి వాడు ఆది (శర్వానంద్). తను మంచి గిటారిస్ట్ మ్యూజిక్ రంగంలో తనను తాను నిరూపించుకోవాలని చూస్తుంటాడు. కానీ స్టేజ్‌పై పాడాలంటే భయం. ఆది ప్రేయసి వైష్ణవి (రీతూ వర్మ) ఎంతో ధైర్యం చెప్పి, అవకాశాలు ఇప్పించినా సక్సెస్ కాలేకపోతుంటాడు. రెండోవాడు చైతన్య (ప్రియదర్శి) మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటాడు. ఏ అమ్మాయి ఓ పట్టానా నచ్చదు. మూడోవాడు శ్రీను (వెన్నెల కిషోర్) చిన్నప్పుడు సరిగ్గా చదువుకోకపోవటంతో హౌస్ బ్రోకర్‌గా మారుతాడు. తనకు ఇంగ్లీష్ రాదు. ఆది విషయానికి వస్తే తన భయానికి కారణం అమ్మ లేకపోవటమే. ఆమె చిన్నతనంలో ఓ యాక్సిడెంట్లో మరణిస్తుంది. అప్పటి నుంచి తనలో తెలియని భయం వచ్చేస్తుంది.
ఇలా సాగిపోతున్న ముగ్గురు స్నేహితుల జీవితాల్లోకి సైంటిస్ట్ రంగి కుట్టా పాల్ (నాజర్) ప్రవేశిస్తాడు. శ్రీను ద్వారా ఆది, చైతన్య అనుకోకుండా పాల్ని కలుస్తారు. రంగి కుట్టా పాల్ జీవితంలో జరిగిన ఓ ఘటనకు.. ఆది జీవితంలో జరిగిన ఘటనకు ఓ సంబంధం ఉంటుంది. ఇద్దరి సమస్యలు తీరాలంటే.. ఆదిని భూత కాలంలోకి పంపిస్తే సరిపోతుందని పాల్ భావిస్తాడు. తన దగ్గరున్న టైమ్ మిషన్‌తో ఆదిని వెనక్కి పంపుతానని అంటాడు. అదే సమయంలో స్నేహితులైన చైతన్య, శ్రీను కూడా భూత కాలంలోకి వచ్చి తమ తప్పులను సరి చేసుకోవాలని అనుకుంటారు. భూత కాలంలోకి వెళ్లిన ఆది తల్లిని కలుస్తాడా? లేదా? ముగ్గురు స్నేహితులకు ఎదురైన వింత పరిస్థితులు ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి…
విశ్లేషణ… అమ్మ సెంటిమెంట్‌తో ముడిపెట్టిన టైమ్ ట్రావెల్ కథ ఇది. ఇరవై ఏళ్ల క్రితం దూరమైన అమ్మని తిరిగి కలుసుకోవడం అనే బలమైన ఎమోషనల్ పాయింట్‌తో దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ కథను రాసుకున్నాడు. అమ్మ సెంటిమెంట్ అనగానే భావోద్వేగాల్ని పండించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు హృద్యంగా తెరపైకి తీసుకురాగలిగాడు. అమల-శర్వానంద్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా కట్టిపడేస్తాయి. ప్రథమార్థంలో ముగ్గురి మిత్రుల నేపథ్యంలో చక్కటి వినోదంతో కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు వాళ్ళ మధ్య చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు వున్న అనుబంధం బాగా చూపించాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా వెన్నెల కిషోర్ కామెడీతో పాటు ప్రియదర్శి లవ్‌ట్రాక్ కావాల్సినంత హాస్యాన్ని పండించింది. ఈ స్నేహబంధంతో పాటు, అమ్మ సెంటిమెంట్ కూడా దర్శకుడు జోడించడంతో సెకండ్ హాఫ్ అంతా భావోద్వేగంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత కోల్పోయిన ప్రేమను తిరిగి పొందితే ఎలా ఉంటుందో కదా అనే భావన కలుగుతుంది.
నటవర్గం… శర్వానంద్ రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నంగా చేసిన చిత్రం. నటుడిగా పాత్రలో ఒదిగిపోయారు. తల్లితో వున్న సన్నివేశాలు అన్నీ బాగా రక్తి కట్టించాడు. ఇక అమల అక్కినేని ఈ సినిమాకు ప్రధానాకర్షణగా చెప్పొచ్చు. తన అనుభవంతో అమ్మ పాత్రకు పరిపూర్ణత తీసుకొచ్చింది. ఇక హీరోయిన్ రీతూ వర్మ కథానాయకురాలిగా బాగా ఆకట్టుకుంది. పాత్రకు న్యాయం చేసింది. అలాగే ప్రియదర్శి కి చాలా మంచి పాత్ర దొరికింది, దాన్ని అతను బాగా చేసాడు. ఇక సినిమాలో హైలైట్ మాత్రం వెన్నెల కిశోర్. ఇందులో కామెడీతో పాటు కొంచెం సీరియస్‌నెస్ ఉంది. అతను తన పాత్రని చాలా బాగా చెయ్యడమే.. సినిమాకి పెద్ద రిలీఫ్. నాజర్ సైన్టిస్ట్ గా బాగా చేసారు.
తరుణ్ భాస్కర్ రైటర్‌గా మంచి సంభాషణలు సమకూర్చారు. భావోద్వేగ సన్నివేశాల్లో తన డైలాగులు మరింతగా పండాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతంలో పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కథలోని ఉద్వేగాల్ని ఒడిసిపట్టింది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ సినిమాకి హెల్ప్ అయ్యింది -రాజేష్