కెమెరా ముందుకు మళ్ళీ ఎప్పుడో.. చెప్పలేను !

షారుఖ్‌ఖాన్ నటించిన ‘జీరో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటించారు. ఈ సినిమా ఫెయిల్యూర్.. కథాంశాల ఎంపికలో తనను పునరాలోచనలో పడేసిందని చెప్పారు షారుఖ్‌ఖాన్. ‘జీరో’ చిత్రాన్ని ఇటీవలే బీజింగ్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓ చైనీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ తన భవిష్యత్తు కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు….
 
” బీజింగ్ చిత్రోత్సవంలో జీరో చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల సంతోషంగా ఉన్నా…సినిమా ఘోరపరాజయం నిరుత్సాహపరిచిందని అన్నారు. సినిమాలకు కొంతకాలం పాటు విరామం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. తిరిగి ఎప్పుడు కెమెరా ముందుకు వస్తానో ఖచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం నా పిల్లల చదువుపై దృష్టిపెడుతున్నాను. పుస్తక పఠనంపై ఆసక్తిపెంచుకున్నాను.ఈ మధ్య దాదాపు 20కిపైగా కథల్ని విన్నాను. అందులో రెండుమూడు బాగా ఉన్నాయనిపించాయి. అయితే ఏ సినిమా చేయాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు. నా హృదయం ఎప్పుడు సంసిద్ధత తెలియజేస్తుందో అప్పుడే సెట్స్‌లోకి అడుగుపెడతాను. ఈ సంధికాలంలో జీవితాన్ని విశ్లేషించుకునే అవకాశం దక్కింది” అంటూ తాత్విక ధోరణిలో స్పందించారు షారుఖ్‌ఖాన్.
 
భారతదేశ తొలి అంతరిక్ష యాత్రికుడు రాకేష్‌శర్మ జీవిత కథా చిత్రంలో షారుఖ్ నటించాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.షారుక్‌ నెక్ట్స్‌ ఏ సినిమా చేస్తున్నాడు? అటు బాలీవుడ్‌లోనూ ఇటు ఆయన అభిమానుల్లోనూ ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ ఇది. ‘జీరో’ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంచెం ఆలోచనలో పడ్డ ఖాన్‌ తర్వాత ఏంటి? అనే ప్రశ్న షారుక్‌ ముందుంచితే – ‘‘ప్రస్తుతానికి కథలు మాత్రమే వింటున్నాను. ఇంకా ఏమీ డిసైడ్‌ అవ్వలేదు. జూన్‌లోపు ఏ సినిమా చేయాలో నిర్ణయించుకుంటాను’’ అని పేర్కొన్నారు. ‘డాన్‌’ సిరీస్‌లో ‘డాన్‌ 3’, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా.. ఇలాంటి వార్తలు ప్రస్తుతానికి షికారు చేస్తున్నాయి. మరి.. షారుక్‌ ఏం చేస్తారో తెలిసేది జూన్‌ తర్వాతే.
 
ఒక నేషనల్‌ అవార్డు, ఓ ఆస్కార్‌…
‘‘నా కెరీర్‌లో నేషనల్‌ అవార్డు రాకపోవడమే అసంతృప్తి’ అని ఓ సందర్భంలో షారుక్‌ పేర్కొన్నారు. తాజాగా ఈ కామెంట్‌ మీద ఓ ఈవెంట్‌లో మాట్లాడారాయన. ‘‘అప్పుడు నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కేవలం జోక్‌ మాత్రమే. నేషనల్‌ అవార్డ్‌ రాలేదని నాకు ఎటువంటి విచారం లేదు. ఒకవేళ అవార్డు రాకపోతే అది కోల్పోయానని అనుకునే మనస్తత్వం కాదు నాది.అలాగే ఆర్టిస్టిక్‌ స్పేస్‌ని ఎక్కువ శాతం వినియోగించలేదని అనుకుంటున్నాను. నేను చేసిన వాటిలో ఎక్కువ శాతం కమర్షియల్‌ చిత్రాలే ఉన్నాయి. అయినప్పటికీ అందులో ఆర్ట్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాను’’ అని పేర్కొన్నారు. మరి నేషనల్‌ అవార్డ్‌ రాకపోవడం వెలితిగా ఉందా? అని మళ్లీ అడగ్గా – ‘‘ఒక నేషనల్‌ అవార్డు, ఓ ఆస్కార్‌ సాధిస్తే నా అవార్డుల కలెక్షన్స్‌ పూర్తవుతుంది’’ అని పేర్కొన్నారు షారుక్‌.