ప్రముఖ సినీ గాయకుడు, లలిత సంగీత కళాకారుడు కె.బి.కె.మోహన్‌రాజు (85) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ‘పూలరంగడు’, ‘సాక్షి’, ‘బ్రహ్మచారి’, ‘తాసీల్దారుగారి అమ్మాయి’, ‘దేవుడమ్మ’, ‘విధి విలాసం’, ‘పెద్దన్నయ్య’ తదితర చిత్రాల్లో గీతాల్ని పాడి పేరు తెచ్చుకొన్న ఆయన, ఆల్ ఇండియా రేడియోలోనూ, టెలివిజన్‌లోనూ 1959 నుంచి వేలాది లలిత గీతాలు ఆలపించి శ్రోతల్ని అలరించారు. ఉషాకన్య, శేషయ్య దంపతులకి విజయవాడలో 1934లో జన్మించిన మోహన్‌రాజు పూర్తి పేరు కొండా బాబూ కృష్ణ మోహన్‌రాజు. బెజవాడ ఎలెక్ట్రిసిటీ బోర్డ్‌లో ఎల్.డి.సిగా చేరిన ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్ర సిటీ బోర్డ్ ఛీఫ్ పర్సనల్ ఆఫీసర్ హోదాలో పదవీ విరమణ పొందారు. ఆయనకి నలుగురు అబ్బాయిలు, ఒకమ్మాయి.
చిన్నప్పుడే శాస్త్రీయ సంగీతం నేర్చుకొన్న మోహన్రాజుకి పాఠశాలలో ఉండగానే రేడియోతో అనుబంధం ఏర్పడింది.పాటలు పాడుతూ, చిన్న చిన్న నాటకాలు వేశారు. ఉద్యోగరీత్యా మద్రాసుకి బదిలీపై వెళ్లాక సినీ నేపథ్య గాయకుడిగా ప్రయత్నాలు చేశారు. ‘పూలరంగడు’ చిత్రంలో తొలి అవకాశం అందుకొన్న ఆయన అందులో ‘చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవి’ అనే గీతాన్ని ఆలపించారు. ఆ పాటే ఆయనకి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాక్షి’లో ‘ఎవరికి వారే ఈలోకం..’ పాటని పాడారు. ‘సంపూర్ణ తీర్థయాత్ర’ అనే ఒక అనువాద చిత్రంలో 57 నిమిషాల పాట పాడారు. దేశవిదేశాల్లో నిర్వహించిన వేలాది కచేరీల్లో పాల్గొని రామదాసు కీర్తనలు, భగవద్గీత ఆలపించారు. మోహన్‌రాజు అమ్మాయి వీణ ఆయన వారసత్వం పుణికి పుచ్చుకొని కచేరీలు నిర్వహిస్తున్నారు. కె.బి.కె.మోహన్‌రాజు అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.