సీనియర్ జర్నలిస్ట్, ఎన్టీయార్, ఎయన్నార్ కు అత్యంత ఆప్తులు నాదెళ్ళ నందగోపాల్ గారు ఈ రోజు మధ్యాహ్యం నిద్రలోనే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన తన కుమారులకు గోపీచంద్, ప్రత్యగాత్మ అనే పేర్లను పెట్టుకున్నారంటే వారికి వారి గురువుల పట్ల ఎంత అభిమానం ఉందో తెలుసుకోవచ్చు. ‘జ్వాల’ పత్రిక సంపాదకులుగా ప్రత్యగాత్మ ఉన్న సమయంలో విద్యార్థిగా ఉంటూనే నందగోపాల్ గారు అందులో పనిచేస్తూ పాత్రికేయ వృత్తికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించిన అన్ని శాఖల పట్ల అవగాహన తెచ్చుకున్నారు. పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ చేశారు. పలు సినిమా పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ‘తెలుగు వెలుగు’ పత్రికకు ఆయన తొలి సంపాదకులు. సినిమా వాళ్ళతోనే కాదు… రాజకీయ నేతలతోనూ ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం ఆయనది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా నంది అవార్డు అందుకున్నారు. ఆయన రాసిన ‘సినిమాగా సినిమా’ పుస్తకం జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డునూ పొందింది.