సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత !

విలక్షణ నటుడు రాళ్లపల్లి (73) ఇక లేరు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకి ఈ నెల 15న ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ నటుడిగా, ప్రతినాయకుడిగా 850కిగాపైగా సినిమాల్లో నటించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై తనదైన ముద్ర వేశారు. నటనని వృత్తిగానో, ప్రవృత్తిగానో కాకుండా… నటనే ప్రాణంగా భావించిన అరుదైన నటుడు రాళ్లపల్లి. సినిమా రంగంపైనే కాకుండా నాటక, టెలివిజన్‌ రంగాలపైనా చెరిగిపోని ముద్ర వేశారు. 1945 ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో ఉపాధ్యాయుడు రాళ్లపల్లి వెంకట్రావు, కామేశ్వరమ్మ దంపతులకి జన్మించిన ఆయన పూర్తి పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. 1958లోనే హైదరాబాద్‌ వచ్చిన ఆయన నాంపల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. చదువుకొనే రోజుల్లోనే కళాశాలలో జరిగిన పోటీల కోసం ‘మారని సంసారం’ అనే నాటిక రాశారు. ఆ రచనకీ, నటనకి పురస్కారాలు లభించగా, నటి భానుమతి చేతుల మీదుగా స్వీకరించారు. ఎనిమిది వేలకి పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు.
సినిమా రంగంపై ఆసక్తి పెంచుకొన్న ఆయన 1973లో ‘స్త్రీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘ఊరుమ్మడి బతుకులు’ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ చిత్రం చేశారు. బాపు దర్శకత్వం వహించిన ‘తూర్పు వెళ్లేరైలు’తో రాళ్లపల్లి కెరీర్‌ మలుపు తిరిగింది., ‘చిల్లరదేవుళ్లు’, ‘చలిచీమలు’, ‘సీతాకోక చిలుక’, ‘శుభలేఖ’, ‘ఖైదీ’, ‘ఆలయ శిఖరం’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘అభిలాష’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘సితార’, ‘ఆలాపన’, ‘న్యాయానికి సంకెళ్లు’, ‘ఏప్రిల్‌ 1 విడుదల’, ‘సూర్య ఐపీఎస్‌’, ‘దొంగపోలీసు’, ‘కన్నయ్య కిట్టయ్య’, ‘సుందరకాండ’, ‘జయం’, ‘బొంబాయి’, ‘భలే భలే మగాడివోయ్‌’, ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. జంధ్యాల, వంశీ సినిమాల్లో రాళ్లపల్లి కీలక పాత్రలు పోషించారు.
సినిమా రంగంలోకి అడుగు పెట్టకముందు రైల్వేలో కొన్నాళ్లూ, హైదరాబాద్‌లోని మినిస్ట్రీస్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌లో కొన్నేళ్లు ఉద్యోగం చేసిన ఆయన, ‘తూర్పు వెళ్లే రైలు’ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి నటనపైనే దృష్టిపెట్టారు. తెలుగు విశ్వ విద్యాలయంలో రంగస్థల శాఖలో ఎం.ఫిల్‌ చేసిన రాళ్లపల్లి మంచి నటుడే కాదు చేయి తిరిగిన వంటకాడు కూడా. టెలివిజన్‌లో పలు వంటల కార్యక్రమాల్ని నిర్వహించారు. ధారావాహికల్లోనూ, టెలీఫిల్మ్‌ల్లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకుల్నీఅలరించారు. రాళ్లపల్లికి విజయమాధురి, రష్మిత సంతానం కాగా… విజయ మాధురి మెడిసిన్‌ చదివేందుకని రష్యాకి వెళుతుండగా, తీవ్ర జ్వరంతో కన్నుమూశారు. మరో కూతురు రష్మిత ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భార్య స్వరాజ్యలక్ష్మి ఉన్నారు. తెలుగు చిత్రసీమలో తనికెళ్ల భరణి, అలీ వంటి ప్రముఖ నటులకి కెరీర్‌ ఆరంభంలో మార్గదర్శకులుగా నిలిచారు రాళ్లపల్లి.
 
వంటల్లోనూ ప్రావీణ్యం
రాళ్లపల్లికి వంటలో మంచి ప్రావీణ్యం ఉంది. కళాకారుడు మంచి వంటవాడయ్యుండాలనేది ఆయన అభిప్రాయం. కమల్‌హాసన్‌, కె.విశ్వనాథ్‌, బాలకృష్ణ, కోదండ రామిరెడ్డి లాంటి చాలామంది ఆయన వంట తిని మెచ్చుకున్నవారే. దర్శకుడు వంశీ అయితే షూటింగ్‌కు విరామం ఇచ్చి మరీ రాళ్లపల్లితో వంట చేయించుకుని తినేవారు. ఓసారి వైజాగ్‌లో ‘శుభసంకల్పం’ షూటింగ్‌ సందర్భంగా రాళ్లపల్లి గుత్తి వంకాయ కూర, ములక్కాడ సాంబారుతో వంట చేస్తే కమల్‌హాసన్‌ సహా అందరూ సంతృప్తిగా తిన్నారు. కమల్‌ భోజనం అయిన వెంటనే కె.విశ్వనాథ్‌ దగ్గరకి వెళ్లి, ‘నాకు గంట విశ్రాంతి కావాలి. షూటింగ్‌కి పిలవొద్దు. ఈయన భోజనం అంత బాగుంది’ అన్నారు. తర్వాత ఆయన రాళ్లపల్లితో, ‘మీరెప్పుడైనా సినిమాల నుంచి బయటకి వచ్చేస్తే మద్రాసు వచ్చి నాకు వంట చేసిపెడితే చాలు’ అని నవ్వుతూ అన్నారు. ఈ సంగతిని రాళ్లపల్లి పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.
 
మరువలేని పాత్రలు…
హాస్యానికి కొత్త మెరుగులు దిద్దినా… విలనీకి వ్యంగాన్ని జోడించినా… క్యారెక్టర్‌ పాత్రలకు కొత్త విరుపులు నేర్పినా… అది రాళ్లపల్లికే చెల్లింది. ముఖ్యంగా సంభాషణలు పలకడంలో ఆయన తీరు విలక్షణం. ఎక్కువగా హాస్యనటుడిగానే కనిపించినా, కొన్ని విలన్‌ పాత్రలనూ రక్తి కట్టించారాయన. రాళ్లపల్లిని తల్చుకోగానే ఎన్నో పాత్రలు, ఎన్నో డైలాగులు గుర్తొస్తాయి…
* జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో ఆయన మందు బాబుల భాష గురించి చెప్పిన డైలాగులు బాగా పేలాయి. ‘‘మాట్లాడ్డమంటే మందుకొట్టడం. ఇంగ్లిషులో మాట్టాడ్డం అంటే ఫారిన్‌ సరుకు తాగడం. తెలుగులో మాట్లాడ్డం అంటే ఇండియన్‌ సరుకు తాగడం. బూతులు మాట్లాడ్డమంటే సారా, కల్లు లాంటివి తాగడం. గుసుగుసగా మాట్లాడ్డం అంటే బీరుగట్రా తాగడం. మౌనం అంటే అసలు తాగక పోవడం…’’ అంటూ ఆయన డైలాగులు చెప్పిన తీరు నవ్వించింది. ఆ డైలాగులు చాలా కాలం మందుబాబుల కోడ్‌ భాషగా మారిపోయాయి. అదే సినిమాలో తెలుగు అర్థం కాని బాస్‌కి వచ్చీరాని ఇంగ్లిషులో పెళ్లి గురించి చెబుతూ ‘సెవెన్‌ స్టెప్స్‌ వాక్క్‌… దెన్‌ ఓన్లీ ఫాల్స్‌… సెవెన్‌ లైఫ్స్‌ నెక్క్‌ టై..’’ అంటూ చెప్పిన తీరు నవ్వులు పండించింది.
* బాపు దర్శకత్వంలో వచ్చిన ‘తూర్పు వెళ్లే రైలు’లో ఆయన ‘నువ్వు అటకెక్కుతాట్ట. నే కత్తితీతాట్ట’ అంటూ ‘ట’ భాషను చిత్రంగా మాట్లాడితే యువత కొన్నాళ్లు దాన్నే అనుకరించింది. ఈ సినిమా విజయం తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోనే స్థిరపడ్డారు.
* మణిరత్నం ‘బొంబాయి’ సినిమాలో హిజ్రా పాత్రలో కూడా బాగా నటించి ఆశ్చర్యపరిచారు రాళ్లపల్లి. ‘చలిచీమలు’ చిత్రంలో ‘భూమిబాయె బుట్రబాయె, నోటికాడ కూడుబాయె…’ అనే పాటను కూడా పాడారు.