సినీవినోదం రేటింగ్ : 2/5
సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పై చరణ్ లక్కాకుల దర్శకత్వం లో డా. రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు
సప్తగిరి (సప్తగిరి) పల్లెటూరికి చెందిన రైతుబిడ్డ. ఎల్ ఎల్ బీ చదువుకుంటాడు. అక్కడ ఎన్ని కేసులు వాదించినా విలువ ఉండట్లేదని భావిస్తాడు. సిటీకి వెళ్లి మంచి పేరు, డబ్బు తెచ్చుకుని తన మరదలు చిట్టి (కశిష్ వోరా) ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ ప్రకారమే సిటీకి చేరుకుని తన బావ (నిర్మాత రవికిరణ్) అండ చూసుకుని గడుపుతుంటాడు. అలాంటి సమయంలో అతనికి రాజ్ పాల్ (సాయికుమార్) అనే పేరుమోసిన లాయర్ గురించి తెలుస్తుంది. రాజ్‌పాల్ వాదించి క్లోజ్ చేసిన ఓ యాక్సిడెంట్ కేసును పిల్ వేసి మరలా రిఓపెన్ చేయిస్తాడు సప్తగిరి. ఆ కోర్టుకు జడ్జి (శివప్రసాద్). రాజ్ పాల్ అనే కొండను ఢీ కొట్టిన సప్తగిరి ఆ క్రమం లో ఎటు వంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు ? రాజ్‌పాల్ క్లైంట్ చేసిన యాక్సిడెంట్లో చనిపోయింది ఎవరు? భిక్షగాళ్లా? రైతులా? సిటీలో తొలి కేసులోనే సప్తగిరి విజయాన్ని సాధించాడా ? అనేది సినిమాలో చూడాలి …..
సప్తగిరి హీరోగా చేసిన మరో ప్రయత్నమే ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. పెద్దవాళ్ళు చేసిన రోడ్ యాక్సిడెంట్స్‌లో నిందితులకు శిక్ష పడటం సాధారణంగా జరగదు . అలాంటి సెన్సిటివ్ పాయింట్ పై రూపొందిన ‘జాలీ ఎల్.ఎల్.బి’ మంచి విజయం సాధించింది. దీన్ని తెలుగులో ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’గా రీమేక్ చేశారు.అయితే ,’సప్తగిరి ఎల్ఎల్బి’లో ఈ మంచి కథ పక్క దారులు పట్టి సహనాన్ని పరీక్షించేంత గందరగోళంగా తయారైంది. ఈ కథకి డాన్సులు, ఫైట్లు సెట్ అవుతాయా లేదా? అనేది కూడా చూడకుండా, ‘తెలుగు హీరో కాబట్టి అవన్నీ చేసి తీరాల్సిందే’ అన్నట్టు సప్తగిరి కోసం ‘జాలీ ఎల్ఎల్బి’ అనే మంచి చిత్రాన్ని ఖూనీ చేసేసారు . పాటలు, ఫైట్లని కథ డిమాండ్ చేయడం వేరు… మన డిమాండ్ల కోసం కథని అడ్డదిడ్డం గా మార్చెయ్యడం వేరు.
కామెడీ కోసమని పెట్టిన సన్నివేశాలన్నీ పేలవంగా తయారవడమే కాకుండా, ఇంకా ఇలాంటి కామెడీ కి ప్రేక్షకులు నవ్వుతారని ఆశించిన వారి తెలివి మీద అనుమానం కలుగుతుంది .దండుపాళ్యం గ్యాంగ్ మనిషిలా సప్తగిరి చేసే కామెడీ, ఊర్లో ప్రభాస్ శ్రీను దగ్గర నిజం చెప్పించే సీన్స్ ఎఫెక్టివ్‌గా లేవు. రైతుల సమస్యల గురించి మాట్లాడితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చనే ఆశతో కొంత ప్రయత్నించారు . కానీ, అలాంటి పెద్ద విషయాల గురించి మాట్లాడేందుకు చిరంజీవి అంత స్టేచర్ వున్న నటులు ఉంటేనే తెరపై పండుతుంది . ఒరిజినల్ సినిమాకి ఎలాంటి పనికిమాలిన, చెత్త సవరణలు చేయకుండా సిన్సియర్‌గా… అదే కోవలో చేసినట్టయితే ఈ చిత్రం ఇక్కడా జనాదరణ పొందేది . సప్తగిరికి నటుడిగా మంచి, కొత్త ఇమేజ్ ఇచ్చి వుండేది. క్లైమాక్ లో కోర్టు రూమ్ సన్నివేశం ఒరిజినల్‌కి కొంతవరకూ దగ్గరగా వుండడం వల్ల బాగా వచ్చింది . అయితే, సాయి కుమార్, శివప్రసాద్ వంటి ఉద్దండుల సరసన నటుడిగా సప్తగిరి తేలిపోయాడు. టైటిల్ పాత్రలో సప్తగిరి … ముందు కామెడీతో, తర్వాత సీరియస్‌గా సాగే పాత్రలో తనదైన రీతిలో నటించాడు . అలాగే సెకండాఫ్‌లో రైతులకు న్యాయం చేసే విధంగా పోరాడే సన్నివేశాల్లో సప్తగిరి నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా కోర్టులో ఎమోషనల్‌గా మాట్లాడే సన్నివేశం బావుంది. డ్యాన్సులు కూడా బాగానే చేశాడు.
ఈ చిత్రం లో ప్రధానాకర్షణ జడ్జిగా సౌరభ్ శుక్లా పాత్ర చేసిన శివ ప్రసాద్ , క్రిమినల్ లాయర్‌గా బొమన్ ఇరానీ పాత్ర చేసిన సాయికుమార్ .’సప్తగిరి ఎల్ఎల్బి’కి సంబంధించి వీరిద్దరే సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెట్టారు. ‘జాలీ ఎల్ఎల్బి’ చిత్రం లో జడ్జి పాత్రని అద్భుతంగా పోషించిన సౌరభ్‌కి జాతీయ పురస్కారం కూడా లభించింది. ఆ పాత్రని ఇక్కడ శివ ప్రసాద్ పోషించారు. తన శాయశక్తులా ఈ పాత్రని రక్తి కట్టించడానికి కష్టపడి … సౌరభ్ స్థాయిలో చేయలేకపోయినా పాత్రకుపూర్తి న్యాయం చేసాడు. బొమన్ ఇరానీ మాదిరిగా ఆ పాత్రకి సహజత్వాన్ని తీసుకురాలేకపోయినా క్రిమినల్ లాయర్ పాత్రలో సాయికుమార్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక హీరోయిన్ కశిష్ వోరా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలకే పరిమితం అయ్యింది. ఇక మిగిలిన పాత్రల్లో రవికాలే, గొల్లపూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరాం, కోట శ్రీనివాసరావు, షకలక శంకర్, రఘుబాబు, ఝాన్సీ తదితరులు నటించారు.
పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సినిమాకి ప్లస్ అయ్యాయి . ఇక సారంగం సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్‌ను విజువల్‌గా చక్కగా ప్రెజెంట్ చేశాడు. బుల్గానిన్ సాంగ్స్ ఏవీ సందర్భానుసారంగా లేవు. ఈ చిత్రం లో పాటల చిత్రీకరణ కోసం బయటి దేశాలకి వెళ్లాల్సిన అవసరం ఉందా ? అనే అనుమానం కలుగుతుంది . అయితే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ‘ఏమైంది ఏమైంది..’ అనే పాట, అందులో ఎమోషన్స్ బావున్నాయి. గౌతమ్ రాజు తన ఎడిటింగ్ తో ఎన్నో సందర్భాల్లో సినిమాని కాపాడారు – రవళి