సినీవినోదం రేటింగ్ : 2.5/5
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్ పై పవన్ కుమార్ దర్శకత్వం లో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు
కధలోకి వెళ్తే …
ఇంజనీరింగ్ చదివిన రచన(సమంత) జర్నలిజంపై ఆసక్తితో ఇండియాటుడేలో జర్నలిస్ట్‌గా జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు ఆదిత్య(రాహుల్ రవీంద్రన్) పరిచయం అవుతాడు. ఆర్.కె.పురం ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుసుకున్న రచన.. దానిపై వివరాలు సేకరించి ఓ ఆర్టికల్ ప్రచురించాలనుకుంటుంది. ప్లై ఓవర్‌పై మధ్యలో కొందరు ఎటువంటి టర్న్ లేని దగ్గర యూ టర్న్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎందుకు తీసుకుంటారు? అని వివరాలు సేకరించి వారి ఇంటర్వ్యూలు ఆధారంగా ఆర్టికల్ వేయాలనుకుంటుంది రచన. అందులో భాగంగా అక్కడ యూటర్న్ తీసుకునే వాహనాల నంబర్స్ నోట్ చేసుకుని.. ఓ వ్యక్తి ఇంటికి వెళుతుంది. రచన వెళ్లే సమయానికి ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. పోలీసులు రచనపై అనుమానంతో కేసు ఫైల్ చేస్తారు. అయితే ఎస్.ఐ.నాయక్ మాత్రం రచన నిర్దోషి అని నమ్ముతాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన రచన మళ్లీ ఫ్లై ఓవర్ దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించే క్రమంలో.. ఆమెకు నాయక్ తోడుగా వస్తాడు.. వారికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఫ్లై ఓవర్‌పై యూ టర్న్ తీసుకునే వ్యక్తులు చనిపోతుంటారు. అలా ఎందుకు చనిపోతున్నారు? అలా చనిపోవడం వెనుక ఎవరుంటారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ …
నిర్లక్ష్యం.. మనం చేసే చిన్న వల్ల ఒక్కోసారి ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలుగుతుంటుంది. అలాంటి ఓ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు పవన్ కుమార్ ఓ కథను తయారు చేసుకుని కన్నడలో సినిమా చేసాడు. ఈ కన్నడ సూపర్ హిట్ సినిమాను సమంత తెలుగులో రీమేక్ చేశారు. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు వర్షన్ ను కూడా డైరెక్ట్ చేశారు. అనవసరమైన కామెడీ, సాంగ్స్ లాంటివి ఇరికించకుండా మంచి థ్రిల్లర్‌లా సినిమాను నడిపించాలని కృషి చేసాడు.
అయితే, పవన్ ట్రీట్మెంట్ రాసుకోవడంలో మాత్రం కొంత విఫలమయ్యారు. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగతీశారనిపిస్తోంది. ముఖ్యంగా సెకెండాఫ్ లో స్లోగా సాగే కథనం ఫ్లాట్ గా ఉండి, సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది. కొన్ని సన్నివేశాలను బాగానే చిత్రీకరించినప్పటికి, సినిమాలో చాలా భాగం పట్టుగా సాగకపోవడం, భూమిక చావ్లా క్యారెక్టర్ తాలూకు సన్నివేశాలు బాగున్నప్పటికీ, అవి వాస్తవానికి దూరంగా ఉండటం, చాలా చోట్ల స్క్రీన్ ప్లే నమ్మశక్యంగా లేకపోవడం.. ఓవరాల్ గా ఈ సినిమాని ఇబ్బంది పెట్టాయి. సమంత,రాహుల్ లవ్ ట్రాక్ కూడా చాలా బోరింగ్ గా సాగుతుంది. దీనికి తోడు సినిమా మొత్తం సింగిల్ పాయింట్ మీద నడవడం కూడా కొంత విసుగు తెప్పిస్తుంది.
ఉత్కంఠతో సాగే ‘యు టర్న్’ అసలు కారణం రివీల్ అయిన తర్వాత చప్పబడి పోయింది. వాస్తవాతీతంగా, ఊహాజనితం గా అనిపించే ఆ చివరి సన్నివేశం థ్రిల్‌ని తగ్గించేసింది, దాంతో సగటు సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లా మారిపోతుంది. లాస్ట్ సీన్స్ చాలా రొటీన్ గా, సినిమాటిక్‌గా అనిపించడం ఈ చిత్రం ఫైనల్ ఇంపాక్ట్‌ని కాస్త తగ్గించేస్తాయి.
నటీనటులు …
నటిగా మంచి విజయాలను సాధిస్తున్న సమంత మరోసారి ఈ చిత్రం లో నటనతో తనెంటో ప్రూవ్ చేసుకుంది. ప్రేమ, భయం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించింది. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.
రచనకు సాయంచేసే పోలీస్ఆఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. అవకాశం ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జర్నలిస్ట్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ ఆకట్టుకున్నారు. భూమిక పాత్ర తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా మంచి ఎమోషన్స్ పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో భూమిక నటన కంటతడిపెట్టిస్తుంది. సమంత ఫ్రెండ్ పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇతర పాత్రలో నరేన్, రవి ప్రకాష్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు…
నికెత్ బొమ్మి రెడ్డి కెమెరా పనితనం ఇంప్రెసివ్ గా ఉంది. ఆయన తీసిన విజువల్స్ చాలా బాగున్నాయి. పూర్ణ చంద్ర అందించిన సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది.ముఖ్యంగా మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటర్ సురేష్ పనితరం కూడా పర్వాలేదనిపిస్తోంది -రాజేష్