ఇంతకు ముందెప్పుడూ లేనంత కష్టపడ్డా !

తన కేరీర్‌లోనే తొలిసారిగా ఒక పాత్ర కోసం కష్టపడి నటించినట్లు నటి సమంత చెబుతోంది. సమంత బహుభాషా నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ప్రముఖ కథానాయకిగా వెలుగొందుతోంది. గతేడాది నటించిన చిత్రాలన్నీ సమంతను సక్సెస్‌ బాటలో నడిపించాయి. ఈ ఏడాది అది రిపీట్‌ చేయాలని సమంత ఆశ పడుతోంది. అలా ఇటీవల తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం తెరపైకి రానుంది. దీని విజయం సమంతకు చాలా ముఖ్యం. అయితే ఈ బ్యూటీ కష్టపడి నటించిన చిత్రం మాత్రం అది కాదు.
 
తమిళంలో ‘అరండ కాండం’ చిత్రం ఫేమ్‌ త్యాగరాజన్‌ కామరాజా దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఫాహత్‌ ఫాజిల్‌ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్‌ దశలో ఉంది. ఇందులో విజయ్‌సేతుపతి తొలిసారిగా హిజ్రాగానూ కొంచెం సేపు కనిపించనున్నారు. కాగా నటి సమంత పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. కథ విభిన్నంగా ఉండటంతో అందులో నటించడానికి ఇంతకు ముందెప్పుడూ లేనంతగా కష్టపడినట్లు సమంత ఇటీవల పేర్కొంది. ఇందులోని వేంబు అనే పాత్ర కోసం దర్శకుడి సలహా మేరకు రిహార్సల్స్‌ చేసి నటించానని, ఈ చిత్రంలోని పాత్ర తనకే కాకుండా తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది.కాగా ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
 
రాజకీయ నేత పాత్రలో…
విజయ్‌సేతుపతి ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలో సమంత ఆయనకు జోడీగా నటించింది. ఇప్పుడు మరో చిత్రంలో కూడా విజయ్‌సేతుపతితో జోడీ కట్టనుంది సమంత. డిల్లీప్రసాద్‌ దర్శకత్వంలోని ఈ చిత్రానికి ‘తుగ్లక్‌’ అని పేరుపెట్టారు. విజయ్‌సేతుపతి చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందించనున్నారు. ఇందులో సమంత రాజకీయ నేత పాత్రలో నటించనున్నట్లు సమాచారం.