ఏ పాత్రకు భయపడతానో.. దానికే ప్రాధాన్యత !

‘ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో కూర్చుని నేను ఎంజాయ్ చేయగలిగే సినిమాలనే ఎంపిక చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాను’ అని అంటున్నారు సమంత. ఆమె తమిళంలో ‘సూపర్‌ డీలక్స్‌’లో నటించింది. సమంత, విజయ్‌ సేతుపతి, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన ఈ మల్టీస్టారర్‌ తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ మార్చి 29న రిలీజ్‌ కానుంది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… ‘ఇందులో వేంబు అనే పాత్ర పోషించా. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో నటించేందుకు ఇద్దరు అగ్ర కథానాయికలు నిరాకరించారు. ఆ తర్వాత నాకు ఆ ఛాన్స్‌ వచ్చింది. తొలుత నేనూ భయపడ్డాను.కానీ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని నటించాను. ఇప్పుడు ఆ పాత్రలో నటించినందుకు గర్వపడుతున్నా. ఇప్పుడు పాత్రల ఎంపికలో మార్పు కనిపిస్తుంది. లెక్కలు వేసుకుని సినిమాలు చేయడం ఎప్పుడో మానేశా.సవాల్‌గా అనిపించిన పాత్రలే ఎంపిక చేసుకుంటున్నా. ఏ పాత్రకు భయపడతానో, దానికే ప్రయారిటీ ఇస్తా. అలాంటి పాత్రలే చేస్తా. ఎందుకంటే అవన్ని నాకెంతో ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇప్పుడు ‘సూపర్‌ డీలక్స్‌’లో నటించిన పాత్ర కూడా అలాంటిదే’ అని చెప్పారు.
 
సమ్మర్‌లో మూడుసార్లు థియేటర్స్‌లో…
గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో కలిపి అయిదు సినిమాల్లో కనిపించారు సమంత. అందులో మూడు చిత్రాలు (రంగస్థలం, మహానటి, అభిమన్యుడు) బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలని ఫిక్స్‌ అయినట్టున్నారు. ఈ సమ్మర్‌లో మూడుసార్లు థియేటర్స్‌లో కనిపించనున్నారు సమంత. ఇందులో ఓ తమిళ సినిమా, రెండు తెలుగు సినిమాలున్నాయి. మార్చి 29న సమంత, విజయ్‌ సేతుపతి, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన మల్టీస్టారర్‌ తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ రిలీజ్‌ కానుంది. తమిళంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాతి వారంలో ఏప్రిల్‌ 5న ‘మజిలీ’ రిలీజ్‌ అవుతుంది. వివాహం తర్వాత భర్త నాగచైతన్యతో కలసి సమంత తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న చిత్రమిది. ఈ రెండూ కాకుండా సమంత లీడ్‌ రోల్‌లో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబి’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఇది సమ్మర్‌లోనే రాబోతుందని చిత్రబృందం ప్రకటించింది.
 
తమిళంలో విజయం సాధించిన ’96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సమంత, శర్వానంద్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్‌ తెలుగులోనూ డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో తమిళ కథను పూర్తిగా మార్పు చేసి తెలుగు వెర్షన్‌ తీస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దానిపై సమంత స్పందించింది… “సోషల్‌ మీడియాలో అంతా తప్పుడు ప్రచారం జరుగుతుందని పేర్కొంది. స్క్రిప్ట్‌లో ఎటువంటి మార్పులూ లేవని స్పష్టం చేసింది. ”నేను ఇటీవలే ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ని కలిశాను. ఇటువంటి ప్రచారం గురించి ఏమీ చెప్పలేదు. స్క్రిప్ట్‌ మార్చే ఆలోచనలు కూడా ఆయనకు ఉన్నట్టు నాతో అనలేదు” అని తెలిపింది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.