“భగవంతుడు అన్నింటినీ నా స్థాయికి మించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతలతోనే పేదలకు సాయం చేస్తున్నా”… అని అంటోంది సమంత .సమంత స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఎంత బిజీగా ఉన్నా మరో పక్క సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ తన సేవాతత్పరతను చాటుకుంటోంది. దీనిపై సమంత మాట్లాడుతూ… “నేను నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఈ రెండింటినీ ఏక కాలంలో ఎలా చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా? అని పలువురు అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే పని లేకుంటేనే నాకు ఏమీ తోయదు” అని చెప్పింది.
“నాకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు. నాకంటే ప్రతిభావంతురాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లందరిని కాదని భగవంతుడు నాకు టాప్ హీరోయిన్ స్టేటస్‌ను ఇచ్చాడు. నటనను నేను ప్రాణంగా భావిస్తున్నాను. సినిమాపై నాకున్న ప్రేమకు ఎల్లలే లేవు. సినిమానే నా జీవితంగా మారిపోయింది. ప్రతిభ, పేరు, డబ్బు, హోదా అన్నింటినీ భగవంతుడు నా స్థాయికి మించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతలతోనే పేదలకు సాయం చేస్తున్నాను. నాకు సినీ అవకాశాలు తగ్గి..చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకునే పరిస్థితి వస్తే నా జీవితాన్ని పూర్తిగా సమాజసేవకు అంకితమిస్తా”అని అన్నారు.
హృద్యమైన ప్రేమకథతో ఫిబ్రవరి 14న
శర్వానంద్, సమంత జంటగా దిల్‌రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ’96’ ఆధారంగా హృద్యమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలచేయబోతున్నారు . విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో రూపొందిన ’96’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. త్రిష పోషించిన జాను పాత్రలో సమంత కనిపిస్తున్నది. “కాలప్రవాహంలో విడిపోయిన ఓ జంట కొన్నేళ్ల తర్వాత కలుసుకొని తమ ప్రేమ జ్ఞాపకాల్ని ఎలా పునశ్చరణ చేసుకున్నారనే కథాంశంతో …భావోద్వేగభరిత ప్రేమకథ”గా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్ తెలుగు రీమేక్‌కు నిర్దేశక బాధ్యతల్ని చేపట్టారు. 1996-2019 సంవత్సరాల్లో ఈ కథ జరుగుతుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నారు. త్వరలోనే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటిస్తారు.