‘సమాచార భారతి’ సాంస్కృతిక సంస్థ ‘2వ కాకతీయ ఫిలిం ఫెస్టివల్’ లఘు చిత్రాల ప్రదర్శనను డిసెంబర్ 22న నిర్వహిస్తోంది. నూతన చిత్ర దర్శకులకు తమ అభిప్రాయాలను లఘు చిత్రాల ద్వారా నలుగురికి తెలియజెప్పగలిగే గొప్ప అవకాశంగా దీనిని నిర్వాహకులు అభివర్ణిస్తున్నారు. యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. లఘు చిత్రాల పోటీకి ప్రవేశం ఉచితం. ఉత్తమ లఘు చిత్రం రూ.51 వేలు, రెండవ బహుమతి రూ.21వేలు, మూడవ బహుమతి రూ.11 వేలు.
అయితే ఈ ఏడాది కొత్తగా ‘ఉత్తమ డాక్యుమెంటరీ’ చిత్రం, ‘ఉత్తమ క్యాంపస్’ చిత్రం అనే మరో రెండు విభాగాలను మొదలు పెడుతున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రానికి రూ.21 వేలు, ఉత్తమ క్యాంపస్ చిత్రానికి రూ.11 వేలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ పోటీకి పంపే చిత్రాలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో తీయాల్సి ఉంటుంది. మూకీ చిత్రాలకు కూడా ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. లఘు చిత్రాల నిడివి 20నిమిషాలు, డాక్యుమెంటరీ చిత్రాల నిడివి 30 నిమిషాలకు మించరాదు. పోటీకి పంపే చిత్రాలు జనవరి 2018 నుంచి నవంబర్ 30 లోపు తీసినవి, సొంతవి అయి ఉండాలి. వీటిని హెచ్డీ ఫార్మాట్లో అందివ్వాల్సి ఉంటుంది. ఈ చిత్రాలను 30 నవంబర్, 2018లోగా పంపించాల్సి ఉంటుంది.