‘ప్రియాంక విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా.ఆమెకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.ప్రియాంక చోప్రా నాతో కలిసి పనిచేయక పోయినా ఫర్వాలేదు. కానీ హాలీవుడ్‌లోనైనా పెద్ద హీరోతో కలిసి నటిస్తే చాలు’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. ఆయన హీరోగా ‘భారత్’ లో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. ఇందులో కథానాయికగా ప్రియాంక చోప్రా ఎంపికయ్యారు. అయితే అకస్మాత్తుగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతోపాటు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ కూడా ఆమెకు వచ్చింది. దీనిపై తాజాగా సల్మాన్ స్పందించారు….
సల్మాన్ నిర్మించిన ‘లవ్‌రాత్రి’ ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ‘ప్రియాంక విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆమెకు హాలీవుడ్లో పెద్ద ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చింది. తన ఎదుగుదలను మేం కాదనలేం. అయితే మా చిత్రం ప్రారంభానికి పది రోజుల ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆమె తప్పుకోవడానికి చాలా కారణాలున్నాయి. ఎంగేజ్మెంట్, హాలీవుడ్ ప్రాజెక్ట్, పెళ్ళి, భారతీయ సినిమాలను వదిలేయాలనుకోవడం, నాతో పని చేయకూడదనుకోవడం…. ఇలా కారణం ఏదైనా ఆమె విషయంలో మేం హ్యాపీగానే ఉన్నాం. ఆమెకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. తను మంచి నటి. ఇక ప్రియాంక ‘భారత్’ నుంచి తప్పుకోవడంతో కత్రీనాను కలిశాం. ఆమె చెయ్యడానికి ఒప్పుకున్నారు’ అని తెలిపారు.
ఆ హక్కు నాకుంది !
‘వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌గా పంచుకోవడం నాకిష్టం ఉండదు. పర్సనల్ విషయాలకు సంబంధించి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని ప్రియాంక అన్నారు. హలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్ళిచేసుకోబోతుందనే వార్తలు ఇటీవల వచ్చిన విషయం విదితమే. దీనిపై ఆమె స్పందించారు. ‘ఇప్పటికే 90శాతం నా లైఫ్ పబ్లిక్‌కి తెలుసు. మిగిలిన పదిశాతమైనా ప్రైవేట్‌గా ఉంచుకోవాలనుకుంటున్నా. నేను మహిళను. నా వ్యక్తిగత విషయాలను అంతర్గతంగా ఉంచుకునే హక్కు నాకుంది’ అని చెప్పారు.