కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చుతూ జోథ్‌పూర్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. పది వేల రూపాయల జరిమానాను వేసింది. సల్మాన్ ఖాన్ ను జోథ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. సల్మాన్ మినహా టబు, సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, నీలమ్‌లను కోర్టు నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పును ఇచ్చింది. 1998 అక్టోబర్‌లో ‘హామ్‌సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్‌కు సమీపంలో రెండు కృష్ణ జింకలను సల్మాన్ హతమార్చినట్లు కేసు నమోదైన విషయం విదితమే. ఈ క్రమంలో సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం (సెక్షన్ 51) కింద, ఇతర నటులపై 149 సెక్షన్ కింద అభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తుదివాదనలు గత మార్చి 28న పూర్తయ్యాయి. ఈ కేసులో తీర్పు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోర్టు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కోర్టు తీర్పు వినగానే సల్మాన్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై ఏడ్చారు. ఆయన పక్కనే ఉన్న ఇద్దరు చెల్లెళ్లు అర్పిత, అల్విరా ఖాన్‌లు కన్నీరుమున్నీరయ్యారు. జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.
సల్మాన్ ఖైదీ నెంబర్ 106
కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఖైదీ నెంబర్, వార్డులు కేటాయించారు. దీనిపై జైళ్ల విభాగం డీఐజీ విక్రమ్ సింగ్ జోధ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. సల్మాన్‌కు ఖైదీ నెంబర్ 106 కేటాయించినట్లు తెలిపారు. వార్డు నెంబర్ 2లో సల్మాన్‌ను ఉంచామని, జైలు యూనిఫాంను శుక్రవారం అందించనున్నట్లు వెల్లడించారు.ఇదే బ్యారక్‌లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామిజీ ఆశారాం బాపు ఉంటున్నారు.
సల్మాన్‌కు మెడికల్ టెస్టులు నిర్వహించినట్లు చెప్పారు. ఆరోగ్య పరంగా నటుడికి ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. తనకు ఫలానా కావాలంటూ సల్మాన్ ఏదీ కోరలేదని.. పటిష్టమైన భద్రత ఉండేలా ఏర్పాట్లు చేశామని డీఐజీ విక్రమ్ సింగ్ వివరించారు.
‘సల్మాన్ కోసం ఇప్పటికే సెల్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ఫ్యాన్, ఏసీ లాంటి ఎలాంటి సదుపాయాలు లేవు. ఆశారాంను ఉంచిన బ్యారక్‌లోనే సల్మాన్ ఉంటారు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో బ్యారక్ వద్ద భద్రతను మాత్రం కట్టుదిట్టం చేయబోతున్నాం’ అని జైలు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.