`టైగర్ జిందా హై` సూపర్ హిట్ తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘రేస్ 3’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రేస్’ చిత్ర ఫ్రాంచైజీ సైతం సూపర్ హిట్‌గా నిలవడమే ఈ అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం. దీంతో ఈ సినిమాపై అటు సల్మాన్ అభిమానుల్లోను, ఇటు చిత్ర వర్గాల్లోనూ భారీ క్రేజ్ నెలకొంది. దీనికితోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత బలాన్ని చేకూర్చింది. యాక్షన్, రొమాన్స్, ఫన్ మేళవింపుగా థ్రిల్లర్‌గా సాగే ఈ ట్రైలర్ అభిమానులను, ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘సల్మాన్ ఫ్యాన్స్‌కిది పర్ఫెక్ట్ ట్రీట్’ అని చిత్ర వర్గాలంటున్నాయి. అబుదాబి, థాయిలాండ్‌లో కంపోజ్ చేసిన స్టంట్స్ ట్రైలర్లో హైలైట్‌గా నిలిచాయి. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్, సాక్విబ్ సలీమ్, డైసీ షా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ సరసన హీరోయిన్గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సల్మాన్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా రంజాన్ సందర్భంగా వచ్చే నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా, ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ చానల్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం ఏకంగా వంద కోట్ల రూపాయలు చెల్లించిందట. ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు 120 కోట్ల రూపాయలట. అంటే విడుదలకు ముందే ఈ సినిమా దాదాపు 90 శాతం రికవరీ చేసేసిందన్నమాట. ఇది బాలీవుడ్లో కొత్త రికార్డని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దీంతోపాటు సల్మాన్ ప్రస్తుతం ‘భారత్’ చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు.