సాయిపల్లవి మూడు సినిమాలు ఏక వరుసలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయనే సంతోషంలో ఉంది. ఆమె నటించిన మూడుసినిమాలు ఒకదాని తర్వాత మరొకటి థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాయి. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమాల విడుదల పలు మార్లు వాయిదా పడినప్పటికీ.. ఏదో పక్కాగా ప్లాన్ చేసినట్టు మూడు సినిమాలు ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
‘లవ్‌స్టోరీ’… నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఓ డాన్సర్‌గా రాణించే పాత్రలో సాయి పల్లవి నటించింది.
‘విరాటపర్వం’… రానాకి జోడిగా సాయిపల్లవి నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మావోయిస్ట్‌ని ప్రేమించిన గ్రామీణ యువతి పాత్రని సాయి పల్లవి పోషించింది.
‘శ్యామ్ సింగరాయ్’… కోలకతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘శ్యామ్ సింగరాయ్’లో సాయిపల్లవి మహిళా ప్రాధాన్యత ఉన్న శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. రాబోయే కొద్ది నెలల్లో మూడు సినిమాల్లోని మూడు భిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్న సాయిపల్లవికి కరోనా పరిస్థితులు ఈ విధంగా కలిసొచ్చాయి.
మూడేళ్లలో ఐదు కోట్లు నష్టం!… ఆచితూచి సినిమాల ఎంపిక విషయంలో వ్యవహరిస్తుంది సాయి పల్లవి. పెద్ద హీరో సినిమా అయినా సరే.. తన పాత్రకు ప్రాముఖ్యత లేకుంటే సున్నితంగా తిరస్కరిస్తుంది. అలా గత మూడేళ్లలో సాయిపల్లవి రూ.5 కోట్లు నష్టపోయిందట. సాయిపల్లవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ‘ఫిదా’ సూపర్ హిట్ కావడంతో ఈ మలయాళ కుట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పుకోకుండా కధకు, పాత్రకు ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించిందట. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుందట. ఆ తర్వాత మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే అనుకున్నారట. కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసిందట.అలాగే.. ‘అయ్యప్పనుమ్ కోషియం'( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కర్ణన్'(రీమేక్) వంటి సినిమాలు రిజెక్ట్ చేసిందట. ఇవన్నీ భారీ సినిమాలు కాబట్టి ఆమెకు కోటి పైనే పారితోషికం నిర్మాతలు ఆఫర్ ఇచ్చారట. కానీ హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత లేదు అని భావించి ఆమె రిజెక్ట్ చేసిందట. వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్ యాడ్స్‌ని కూడా ఒప్పుకోలేదట. వీటీ విలువ దాదాపు రూ.5 కోట్ల పైనే ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
యూట్యూబ్‌ను షేక్ చేసింది!… సాయి పల్లవి పాటలంటే అప్పట్లో ‘రౌడీ బేబీ’, ఇప్పట్లో ‘సారంగదరియా’ పాటలే గుర్తొస్తాయి. ఈ పాటల్లో గొప్పదనమో, సాయి పల్లవి స్టెప్పుల్లో అందమో? తెలీదు గానీ.. ఇవి రెండూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ‘సారంగదరియా’ పాట తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ల కు పైగా వ్యూస్ సాధించింది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ జనరంజకంగా ఆలపించింది. తెలంగాణ జానపదానికి తోడు పవన్ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’ పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది.32 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ మైలురాయిని దాటింది.