“ఎన్ని కోట్లిచ్చినా ఎంత పెద్ద హీరో అయినా స్క్రిప్ట్ నచ్చనిదే నటించను గాక నటించ”నంటోంది సాయిపల్లవి. తెలుగునాట ప్రస్తుతం ఆమెకు మహా క్రేజ్ ఉంది. కోట్ల పారితోషికం వస్తోందంటే చాలు …కొంతమంది కథానాయికలు హీరో ఎవరనేది పట్టించుకోరు. ఇక చిన్న హీరోల సినిమాల్లో నటించాలంటే… కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తారు మరికొందరు హీరోయిన్స్. అయితే ఎన్ని కోట్లిచ్చినా సరే తమ పాత్రలకు ప్రాధాన్యం లేకుంటే నటించడానికి ఏ మాత్రం ఒప్పుకోరు కొద్దిమంది హీరోయిన్స్. ఆ కోవకు చెందిన నటి సాయి పల్లవి. ఆమె నటించాలంటే హీరోకి సమానంగా తన పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండాలని పట్టుపడుతూ ఉండడం దర్శకనిర్మాతలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. భారీ పారితోషికం ఆఫర్ చేసినా పట్టించుకోవడం లేదు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన అందరూ స్టార్ హీరోయిన్సే నటించారు. ఏ విషయంలోనూ తగ్గకుండా తన సినిమాలను భారీగా తెరకెక్కిస్తున్నాడు సాయి. అతని దృష్టి ఇప్పుడు సాయి పల్లవి మీద పడింది. తాజా చిత్రంలో సాయిపల్లవిని హీరోయిన్‌గా ఎంపికచేయడానికి ఆమెకు ఏకంగా రెండు కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. అయితే సాయిపల్లవి ఆ ఆఫర్‌ను తిరస్కరించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.ప్రముఖ తారలే శ్రీనివాస్‌తో నటించటానికి సై అన్నారు. మరి సాయిపల్లవికి ఏంటి అభ్యంతరం? అన్నదే ప్రశ్న.
సాయి పల్లవి ….కెరీర్ ఆరంభం నుంచి సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప సినిమాలు చేయనని గిరిగీసుకు కూర్చుంది . హీరోలతో ఆడిపాడే పాత్రలకు నో చెబుతూ వస్తోంది. అలాగే తాజాగా బెల్లంకొండ సాయి సినిమాకు కూడా నో చెప్పిందట సాయి పల్లవి. దీంతో సాయిపల్లవి స్థానంలో వేరే హీరోయిన్‌ను ఎంపిక చేశారట. పారితోషికం కంటే పాత్ర ముఖ్యమనే సాయిపల్లవి ‘ప్రేమం’ మళయాల చిత్రంలో తన నటన ద్వారా అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అభిమానుల ఆదరణకు తగిన విధంగా అనేక చిత్రాల అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయినప్పటికీ అన్ని చిత్రాలను ఒప్పుకోవడం లేదు. అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో ‘కాట్రు వెలియిడై’(చెలియా) చిత్రాన్ని మొదట ఒప్పుకుని, తర్వాత గ్లామర్ పాత్రలో నటించనని చెప్పి విరమించుకుంది. అంతేకాకుండా కొంత మంది ప్రముఖ హీరోల చిత్రాల్లోను నటించేందుకు నిరాకరించింది.
మరోసారి శేఖర్ కమ్ములతో సాయిపల్లవి
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘ఫిదా’. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో శేఖర్ కమ్ముల.. సాయిపల్లవికి మరో అవకాశం కల్పించారు. విక్రమ్ తనయుడు ధృవ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని ఎంపిక చేశారు. ఆమెకు కథ నచ్చడంతో ఓకే కూడా చెప్పారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ నుంచి పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.