రానా దగ్గుబాటి సమర్పణలో (తెలుగులో) గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… గార్గి(సాయి పల్లవి) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్.ఎస్ శివాజీ) హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజు బ్రహానందం పనిచేసే అపార్ట్మెంట్లో ఓ చిన్నారిపై అత్యాచారం జరుగుతుంది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో బ్రహ్మానందం అరెస్ట్ అవుతారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయడని బలంగా నమ్మిన గార్గి..అతన్ని నిర్ధోషిగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది. తండ్రి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాని సమక్షంలో జునియర్ లాయర్ గిరీశం(కాళీ వెంకట్) గార్గికి మద్దతుగా నిలిచి.. బ్రహ్మానందం తరపున వాదించడానికి ముందుకొస్తాడు. ఆ సమయంలో గార్గి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని ఎలా చూసింది? బ్రహ్మానందాన్ని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్ గిరీశం చేసిన ప్రయత్నం ఏంటి? అనేది మనం సినిమాలో చూడాలి…
విశ్లేషణ… ఆడపిల్ల ప్రతి రోజు తన ఉనికి కోసం సమాజంతో యుద్దం చేయాల్సిందే. పని ప్రదేశాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై కూడా అత్యాచారానికి ఒడిగడుతున్నారు. అలాంటి ఘటనల్లో బాధిత కుటుంబంతో పాటు నిందితుల కుటుంబ సభ్యులు కూడా పడే మానసిక క్షోభ ఎలా ఉంటుందనేది ‘గార్గి’ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్. సున్నితమైన అంశాలను అతి సున్నినితంగా డీల్ చేస్తూ.. మంచి సందేశాన్ని అందించాడు. తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం కేసులో నిందితుడైన తండ్రిని నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఓ కూతురు చేసిన న్యాయ పోరాటం ఈ సినిమా ఇతివృత్తం. రెగ్యులర్ కోర్టు డ్రామా సినిమాల్లా కాకుండా కాస్త భిన్నంగా సాగింది.
‘నిందితుల కుటుంబాల పట్ల మీడియా పరిధి దాటి ఎలా ప్రవర్తిస్తుంది, ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తుంది’ అన్నది ఆసక్తిగా తెరకెక్కించారు. ‘గార్గి’ తండ్రి అరెస్ట్ తర్వాత కుటుంబం ఎదుర్కొనే సంఘర్షణ సన్నివేశం ఆకట్టుకుంది. న్యాయమూర్తి ముందు వాద ప్రతివాదనలు చాలా సహజంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అయితే కోర్టు రూమ్ సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపించాయి. ఇంటర్వెల్ తర్వాత మరింత ఆసక్తిగా కథ సాగుతుంది. నమ్మకాలు, సాక్ష్యాలతో కోర్టుకు పని లేదని, కావలసింది ఆధారాలు అని చెప్పారు.ఇక ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ దర్శకుడు లాజిక్‌ను ఫాలో అయ్యాడు.
నటీనటులు… గార్గిగా సాయి పల్లవి తన నటన, హావభావాలతో కథకు, పాత్రకు ప్రాణం పోసింది. ఇలాంటి భావోద్వేగ పాత్రలు పోషించడంలో ఆమెది ప్రత్యేకశైలి అని మరోసారి నిరూపించింది. ఎమోషనల్ సీన్స్‌లో కంట తడి పెట్టించింది. గార్గి తండ్రి బ్రహ్మానందంగా ఆర్.ఎస్ శివాజీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాయర్ గిరీశం పాత్రలో కాళీ వెంకట్ బాగా నటించాడు. అత్యాచారినికి గురైన బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్ తనదైన నటనతో కంటతడి పెట్టించాడు. జయప్రకాశ్, ఐశ్యర్యలక్ష్మీలతో పాటు మిగిలిన నటీనటులు బాగా చేసారు.
గోవింద్ వసంత నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ. సినిమా భావాన్ని ప్రేక్షకులను చేరవేయడంతో నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. కొన్ని సన్నివేశాలకు తనదైన బీజీఎంతో ప్రాణం పోశాడు. స్రైయంతి, ప్రేమకృష్ణ కెమెరా వర్క్ బావుంది. షఫీక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ ఓకే -రాజేష్