ఆమె పెద్ద మనసుకు ‘ఫిదా’

సాయిపల్లవి… సాయిపల్లవి తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే నిర్మాతలు నష్టపోతుంటారు. వీరికి అండగా నిలవడానికి కథానాయకులు తమ పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ దారిలో కథానాయిక సాయిపల్లవి నడిచినట్లు తెలుస్తోంది. ఆమె నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకుడు. శర్వానంద్‌ కథానాయకుడి పాత్ర పోషించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. సినిమా మంచి టాక్‌ అందుకున్నప్పటికీ.. బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత నష్టపోయారట. దీన్ని తెలుసుకున్న సాయిపల్లవి తన 40 లక్షల పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు కథానాయకులు ఇలా చేశారని, తొలిసారి ఓ నటి పారితోషికం వెనక్కి ఇచ్చారని అంతా అంటున్నారు.
 
మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో సాయిపల్లవిగా నటిగా పరిచయం అయ్యారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇందులో ఆమె డ్యాన్స్‌, నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల ధనుష్‌కు జోడీగా సాయిపల్లవి నటించిన ‘మారి 2’ విడుదలై మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె సూర్య సరసన ‘ఎన్జీకే’ సినిమాలో నటిస్తున్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్‌ మరో కథానాయిక. మలయాళ నటుడు ఫాజిల్‌ కొత్త సినిమాలోనూ సాయిపల్లవి నటించనున్నారు.
 
ఎక్కువ వ్యూస్‌ సాధించిన వీడియోసాంగ్
“వచ్చిండే…” అనే పాట వింటే సాయి పల్లవి స్టెప్పులు గుర్తుకురావాల్సిందే. ఫిదా సినిమాలోని ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా ఈ పాటే.. ఏ స్టేజ్‌పైనా అవే స్టెప్పులు. అంతలా అందరి మనుసుల్లో నాటుకుపోయిందీ పాట.
 
సాయి పల్లవి డ్యాన్సులకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. సినిమాలో తను చేసే పాత్రలైనా, పాటల్లో వేసే స్టెప్పులైనా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవే ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డులను క్రియేట్‌ చేస్తున్నాయి. మూడు రోజులు క్రితం రిలీజైన ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌కు నిద్రపట్టకుండా చేస్తుంటే.. ‘ఫిదా’లోని ‘వచ్చిండే’ సాంగ్‌.. సౌత్‌ఇండియాలో అత్యంత వేగంగా.. ఎక్కువ వ్యూస్‌ సాధించిన వీడియోసాంగ్‌గా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ వీడియో సాంగ్‌ను ఇప్పటివరకు 173మిలియన్స్‌ (17.38కోట్లు) వ్యూస్‌ను సాధించింది. సాయి పల్లవి.. తన హావాభావాలు, డ్యాన్సులతో ప్రేక్షకులను కట్టిపడేయడమే ఈ వీడియో సాంగ్స్‌కు ఇంతటి రెస్పాన్స్‌ రావడానికి కారణం.