సాయిపల్లవి తమిళంలో వచ్చిన కొన్ని అవకాశాలను తిరస్కరించినట్లు ప్రచారం జోరందుకుందప్పట్లో. కథ కొత్తగా ఉండాలి. పాత్ర నాకు నచ్చాలి లాంటి కండిషన్లతో సాయిపల్లవి కోలీవుడ్ ఎంట్రీ ఆలస్యం అయిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఆమె ఏరి కోరి తమిళంలో నటించిన ‘దయా’ చిత్రం సాయిపల్లవిని పూర్తిగా నిరాశ పరచింది. సరే ధనుష్‌తో నటిస్తున్న చిత్రం మారి–2 చిత్రం అయినా ఆమె ఖాతాలో హిట్‌గా నిలుస్తుందని ఆశ పడింది.
అందులో ‘రౌడీ బేబీ’ పాట మాత్రం విశేష ఆదరణను అందుకుంది కానీ, సినిమా సాయిపల్లవి కెరీర్‌కు ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. ఇక నటుడు సూర్యతో జత కట్టిన ‘ఎన్‌జీకే’ చిత్రంపై ఆశలు పెట్టుకుంది. అది సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకుని చివరికి నిరాశనే మిగిల్చింది. దీంతో ఇక్కడ మరో అవకాశం లేదు. అంతే కాదు.. సాయిపల్లవి మంచి నటే కానీ, అదృష్టం లేని నటి అనే ముద్ర పడిపోయింది. మాలీవుడ్, టాలీవుడ్‌లో ఈ అమ్మడికి అవకాశాలు బాగానే ఉన్నాయి. టాలీవుడ్ లో ఆమెకు ‘ఫిదా’, ‘ఎంసీఏ’ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో రానాకు జంటగా నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అదే విధంగా మాతృభాషలోనూ నటిగా సాయిపల్లవికి మంచి గిరాకీనే ఉంది. మరో విషయం ఏమిటంటే.. తనకు అవకాశాలు రాకపోతే ఉండనే ఉంది వైద్య వృత్తి అని సాయిపల్లవి ఇది వరకే చెప్పింది. అలాగే పనిలో పనిగా తాను పెళ్లి కూడా చేసుకోనని చెప్పేసింది.
నేను కనిపించగానే పేపర్లు విసిరారు !
‘ఫిదా’లో సాయి పల్లవి నటన చూసి అంతా ముగ్ధులయ్యారు. ‘పడి పడి లేచె మనసు’లోనూ చక్కటి నటన కనబరిచింది. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంటోంది సాయి పల్లవి. ‘నా బలం సహజమైన నటనే.. గ్లామర్ కాదు’ అని చెబుతుంటుంది సాయి పల్లవి. ‘‘తెలుగు నాయికలంతా గ్లామర్‌గా కనిపిస్తారు. నేను అలా కాదు. తెరపై నా కాస్ట్యూమ్స్ కూడా అంత గొప్పగా కనిపించవు. ‘ఫిదా’లో చూడండి. పల్లెటూరిలో అమ్మాయిలు ఎంత సాదాసీదాగా ఉంటారో అలానే కనిపిస్తా. మేకప్ కూడా వేసుకోలేదు. ఆ సినిమా చేస్తున్నప్పుడు చాలా భయపడ్డాను. ‘నేను తెలుగు ప్రేక్షకులకు నచ్చుతానా? వాళ్లు నా మొహం చూస్తారా’ అనిపించింది. థియేటర్‌కి అదే భయంతో వెళ్లాను. కానీ ప్రేక్షకుల స్పందన చూసి మతి పోయింది. నేను కనిపించగానే పేపర్లు విసిరారు. ‘తెలుగులో ఒక్క సినిమా చేసినా ఇంత స్పందన ఉంటుందా’ అని ఆశ్చర్యం వేసింది. థియేటర్లోనే ఏడ్చేశాను. ఇదంతా నా గొప్పదనం కాదు. తెలుగు ప్రేక్షకులదే’’ అని అంటోంది సాయి పల్లవి.