సినీవినోదం రేటింగ్ : 2/5
అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.ఎస్.రవి దర్శకత్వం లో కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
జై(సాయిధరమ్ తేజ్), కేశవ(ప్రసన్న)లు చిన్నప్పటి స్నేహితులు. చిన్నప్పుడే విడిపోతారు. చిన్నప్పటి నుండి కేశవ హింసను, స్వార్ధాన్ని నమ్ముకుని దేశానికి చెడు చేయాలనుకునే తీవ్రవాద సంస్థలతో చేతులు కలుపుతాడు. జై చిన్నప్పటి నుండి ఆర్.ఎస్.ఎస్. సభ్యుడు కావడం..తండ్రి బాధ్యత గల ఉపాధ్యాయుడిగా ఉండటం వంటి కారణాలతో దేశ భక్తుడిగా ఎదుగుతాడు. కానీ కేశవ ‘దేశ ద్రోహి’ అనే విషయం జై తెలియదు. దేశ రక్షణ సంస్థల్లో ఒకటైన డి.ఆర్.డి.ఒ సంస్థలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే కలతో ఉంటాడు జై. కథ దేశ రక్షణ కోసం డి.ఆర్.డి.ఒ. అక్టోపస్ అనే మిసైల్‌ను తయారు చేస్తుంది. ఈ మిసైల్‌ను సొంతం చేసుకుని ఇండియాను భయపెట్టాలని శత్రుదేశాలు ప్రయత్నిస్తాయి. ఆ మిసైల్‌ను దొంగలించే డీల్‌ను కేశవకు అప్పగిస్తారు. అయితే స్టాంపులను తయారు చేసే వ్యక్తి(కోట శ్రీనివాసరావు) వల్ల డి.ఆర్.డి.ఒకి సంబంధించి ఏదో జరుగుతుందని జైకి తెలుస్తుంది. జై వేసే ఓ ప్లాన్ వల్ల అసలు విషయం తెలుస్తుంది. దాంతో దేశానికి చెడు చేయాలనుకునే కేశవ ఆలోచనకి బ్రేక్ వేస్తాడు జై దీంతో జై, కేశవల మధ్య మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. కేశవ ఓ స్నేహితుడిలా..జై ఇంటికి వచ్చి ..అతని కుటుంబాన్నిఇబ్బందులకు గురి చేస్తాడు. చివరకు జై తన కుటుంబాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకున్నాడనేది సినిమాలో చూడాలి …..
మాస్ మసాలా సినిమాలకి కట్టుబడ్డ సాయిధరమ్ తేజ్ తన రెగ్యులర్ బాణీలోంచి బయటకి వచ్చి కొత్త అటెంప్ట్ చేసాడు.కథానాయకుడు దేశమా, కుటుంబమా అనే క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకున్న పరిస్థితుల్లో హీరో ఎలా ఆలోచించాడు, ఏ నిర్ణయం తీసుకున్నాడు? అనే అంశాల్ని బాగా హ్యాండిల్ చేశాడు రచయిత, దర్శకుడు అయిన బివిఎస్ రవి. ఒకవైపు దేశం కోసం పోరాడుతూనే కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో పడే తపన, చేసే ప్రయత్నాలు బాగున్నాయి.’జవాన్’కి ప్లాట్ అయితే బాగా కుదిరింది. డైరెక్టర్ బి.వి.ఎస్. రవి ఎంచుకున్న ఇతివృత్తం బాగుంది. ఈ కథని ఆసక్తికరంగా నడిపించడంలో అతని కృషి తెలుస్తుంది. అయితే కీలకమైన సన్నివేశ బలం చేకూర్చడం, ఉత్కంఠ రేకెత్తించే అంశాలని జోడించడంలో విఫలమయ్యాడు. ఆ కారణంగా బాగా రావాల్సిన సినిమా కాస్తా ఏవరేజ్ స్థాయిని దాటలేకపోయింది.
విలన్ ఎవరనేది హీరో కనిపెట్టే సీన్ పట్ల పెరిగిన ఆసక్తిపై నీళ్లు చల్లేస్తూ ఒక పేలవమైన సీన్ సృష్టించాడు. కేవలం ఒక్క ఫోన్ ద్వారా విలన్ పట్టుబడిపోవడం సిల్లీగా అనిపించింది. పతాక సన్నివేశాలు కూడా సోసో గా ముగించాడు. ముఖ్యంగా హీరో, విలన్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ బాగున్నాయి .విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. రచయితగా బీవీయస్ రవి డైలాగ్స్ చాలా సందర్భాల్లో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. సంభాషణల రచయితగా దేశభక్తి గురించిన మాటల్లో రవి టాలెంట్ తెలుస్తుంది.అలాగే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కథకు స్పీడు బ్రేకర్లలా మారాయి. పాటలు కూడా అదే ఫీల్ కలిగిస్తాయి.
సాయి ధరమ్ తేజ్ పర్‌ఫార్మెన్స్‌తో ఫుల్ మార్కులు వేయించుకుంటాడు.సాయి ధరమ్ తేజ్ తన గత చిత్రాలతో పోలిస్తే జవాన్ లో కొత్త లుక్ లో.. కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. దేశాన్ని కాపాడాలా..? తన కుటుంబాన్ని కాపాడుకోవాలా ..? అన్న సంఘర్షణను హావభావాల్లో చాలా బాగా చూపించాడు. విలన్ గా ప్రసన్న చాలా బాగా అనిపించాడు. ‘ధృవ’ సినిమాలో అరవింద్ స్వామి తరహా స్టైలిష్ విలన్ పాత్రలో ప్రసన్న పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ భార్గవి అనే పెయింటర్‌గా ,బబ్లీ పాత్రలో కేవలం పాటలకే పరిమితమైంది. పాత్ర పరిధి మేరకు గ్లామరస్ గా కనిపిస్తూనే ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో జయప్రకాష్ మరోసారి తన మార్క్ చూపించారు.ఇక నాగబాబు, ఈశ్వరీరావు, సుబ్బరాజు, కోటశ్రీనివాసరావు, సత్యం రాజేష్ వారి పాత్రలకు న్యాయం చేశారు.
తమన్, గుహన్ ఇద్దరూ ఈ చిత్రానికి ప్రధాన బలం అయ్యారు. తమన్ నేపథ్య సంగీతం సాధారణమైన సన్నివేశాలని కూడా అద్భుతంగా ఎలివేట్ చేయగా, గుహన్ ఛాయాగ్రహణం కట్టి పడేస్తుంది. ప్రతి సీన్‌ను రిచ్ విజువల్‌లో తెరపై చూపించాడు. తమన్ స్వరపరిచిన పాటల్లో `బంగారు` అనే సాంగ్‌తో పాటు `బుగ్గ అంచున..` సాంగ్ బానే ఉంది . .’అవునన్నా కాదన్నా..’అనే శ్రేయోఘోషల్ పాట బాగున్నాయి. ‘బంగారు’ పాట చిత్రీకరణ చాలా బాగుంది. ఎస్.ఆర్.శేఖర్‌ఎడిటింగ్, నిర్మాణవిలువలు బాగున్నాయి – ధరణి