పరిస్థితులను పూర్తిగా అర్ధం చేసుకున్నాను !

రితికా సింగ్‌… “అందంగా కనిపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఎక్స్‌పోజింగ్‌కి వ్యతిరేకం” అనిఅంటోంది బాక్సర్ నుండి నటి గా మారిన రితికా సింగ్‌.
 
వెంకీ ‘గురు’ చిత్ర హీరోయిన్ రితికా సింగ్‌…ఆమె పేరు సినీ అభిమానులకు సుపరిచితమే. అయితే అందాల ఆరబోత, ఎక్స్‌పోజింగే ముఖ్యమనుకునే సినీ ప్రపంచంలో ఓ క్రీడాకారిణి రాణించాలంటే కష్టమే! .సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అందం మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా, ఇప్పుడు తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటోంది రితికా సింగ్‌.
‘క్రీడల్లో రాణించినట్టు సినిమాల్లో రాణించకపోవడానికి కారణం?’ …అని ఆమెకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… ‘‘క్రీడలంటే చిన్నతనం నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నాను కనుక.. రింగ్‌లో ప్రత్యర్ధిని ఎలా దెబ్బకొట్టాలో నాకు బాగా తెలుసు. వెండితెర విషయానికి వచ్చేసరికి ఈ రంగం పూర్తిగా కొత్త. కొత్తరంగంలోకి ప్రవేశించినప్పుడు తడబాటు ఎవరికైనా సహజం. నా విషయంలోనూ అదే జరిగింది. ఇక్కడి పరిస్థితులను ఇప్పుడు పూర్తిగా అర్ధం చేసుకున్నాను. ఇకనుంచి వరుస అవకాశాలతోపాటు మంచి విజయాలు అందుకుంటాననే నమ్మకం నాకుంది..’’ అన్నారు.
 
ఆమె ఎక్స్‌పోజింగ్ గురించి మాట్లాడుతూ… ‘‘మొదటి సినిమా తరువాత ఇక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చింది. ఇది గ్లామర్‌ వరల్డ్‌. బయటి ప్రపంచానికి, ఇక్కడి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందాల ఆరబోత, గ్లామర్‌ ఇక్కడ సర్వసాధారణం. దీనికి నేనేమీ మినహాయింపు కాదు. అందంగా కనిపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఎక్స్‌పోజింగ్‌కి వ్యతిరేకం..’’ అని తెలిపింది.
నమ్మి నాకు అవకాశమిచ్చారు
‘సూపర్‌ ఫైట్‌ లీగ్‌’ (మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌)లో నా పోస్టర్స్‌ చూసిన రాజ్‌కుమార్‌ హిరానీ, మాధవన్‌గారు నాకు కాల్‌ చేసి ‘సాలా ఖడూస్‌’ ఆడిషన్స్‌కు రమ్మన్నారు. ఆ సమయంలో నాకు నటన గురించి ఏమీ తెలియదు. కానీ ఆ పాత్రకు నేనైతేనే సూటవుతాను అని నమ్మి నాకు అవకాశమిచ్చారు. ఫైటింగ్‌ తప్ప నటన ఏమాత్రం తెలియని నేను ఆసినిమాతోనే నటనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ సినిమా నా జీవితాన్నే మార్చివేసింది. రింగ్‌లో ప్రత్యర్ధులతో పోరాడాల్సిన నేను నటన విషయంలో తోటివారితో పోటీపడుతున్నాను. ‘సాలా ఖడూస్‌’ షూటింగ్‌ అంతా మురికివాడలో ఓ చిన్న ఇరుకుగదిలో జరిగింది. మొదటిసారి నటించడం కదా.. చాలా ఇబ్బంది అనిపించింది. షూటింగ్‌ మొదలైన కొత్తల్లో, షూటింగ్‌ నుంచి పారిపోదామని అనిపించేది. కానీ నేను ఫైటర్ని కానీ, యాక్టర్ని కాదు. అయినా, నన్ను నమ్మి నాకు అవకాశమిచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదనుకున్నాను. కష్టపడి చేశాను. అంత కష్టపడినందుకు నాకు ఫలితం దక్కింది. ఆ సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. మొదటి సినిమాకే అవార్డు రావడం అనేది నా మటుకు నాకు చాలా గ్రేట్‌. అప్పుడు అనుభవించిన ఆనందాన్ని ఎప్పటికీ మరిచిపోలేను..’’ అని రితికాసింగ్ తెలిపింది.