‘తెలుగు తెరపై ఎర్రజెండాను రెపరెపలాడించిన విప్లవ కథానాయకుడు మాదాల రంగారావు. ‘కళ మన కోసం కాదు, ప్రజల కోసం’ అంటూ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన మాదాల రంగారావు ఇప్పుడు మన మధ్య లేకపోవడం అభ్యుదయ సినిమాకు తీరని లోటు’ అని వక్తలు అన్నారు. విప్లవ సినిమాల ఆద్యుడు, దర్శక,నిర్మాత, నటుడు ‘రెడ్‌స్టార్’ మాదాల రంగారావు అనారోగ్యంతో గత నెల 27న కన్నుమూసిన విషయం విదితమే. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో మాదాల రంగారావు సంస్మరణ సభను నిర్వహించారు.
‘నాలుగున్నర దశాబ్దాలుగా రంగారావు నాకు తెలుసు. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో క్రియాశీలకంగా పనిచేశారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టి వామపక్ష నేపథ్య చిత్రాలు రూపొందించి మంచి పేరు సంపాదించుకున్నారు. సినిమా అనే శక్తివంతమైన కళ ద్వారా వామపక్ష రాజకీయాల అభివృద్ధికి తోడ్పడ్డారు. కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలికను నివారించడానికి ఎంతగానో కృషి చేశారు. చివరి వరకు శ్రమజీవుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆయన మరణం వాపపక్ష రాజకీయాలకు తీవ్ర నష్టం’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ,
‘ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాదాల రంగారావును కలిశాం. ఆయన ఆరోగ్యం గురించి మేం అడుగుతుంటే, ఆయన మాత్రం ఉద్యమం గురించి, మా కార్యక్రమాల గురించి అడిగారు. తన ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి, కుటుంబం గురించి ఏనాడు లెక్కచేయకుండా కమ్యూనిస్టు ఉద్యమం కోసం, ఎర్రజెండా కోసం తపన పడిన వ్యక్తి, మహా నాయకుడు, మంచి ప్రజా కళాకారుడు మాదాల రంగారావు. ఎర్రజెండాను వెండితెరపై వెలిగించిన ముఖ్యుడు, విప్లవ కారుడికి సీపీఎం తరఫున హృదయపూర్వకమైన జోహర్లు. వారి కుమారుడు రవి తండ్రి ఆశయాన్ని కొనసాగించడం సంతోషం. కమ్యూనిస్టులంతా ఏకం కావాలని రంగారావు పదే పదే చెప్పేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఏకమవ్వడం అవసరం. ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి తప్పనిసరిగా మావంతు కృషి చేస్తాం’ అని అన్నారు.
రంగారావు గురువు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ‘సినిమాల్లోని వారంటే సాధారణంగా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. కానీ రంగారావు ముళ్ల దారిని ఎంచుకున్నారు. సమసమాజం కోసం, శ్రామికులు, పేద వారు, అట్టడుగు వర్గాల వారి కోసం సినిమాలు తీసి తాను నమ్మిన సిద్ధాంతాన్ని నిజ జీవితంలో ఆచరించిన వ్యక్తి. నిజానికి ఆయన ధనిక కుటుంబంలో జన్మించారు. కానీ పేద వారి కోసమే కమ్యూనిస్టు ఉద్యమాలు చేపట్టారు. అనేక నాటకాలు, నాటికల ద్వారా ప్రజా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘యువతరం కదిలింది’ సినిమాతీసి విజయం సాధించి వెండితెరపై మొదటి సారి ఎర్రజెండాను ఎగురవేశారు. విప్లవ సినిమాలు తీసి సంచలనం సృష్టించారు. తన సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు తలెత్తినప్పుడు సెన్సార్ ఆఫీసు ముందు నిరాహార దీక్ష చేపట్టి, సెన్సార్ చేయించుకున్న మొదటి వ్యక్తి మాదాల రంగారావు. అలాగే అవుట్ డోర్లో షూటింగ్‌లు నిర్వహించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. టి.కృష్ణ, పోకూరి బాబురావు ఆయన్ని చూసి సినిమాల్లోకి వచ్చినవారే. సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును పేదవారికి, పార్టీలకు విరాళంగా అందించిన మహానీయులు’ అని చెప్పారు.
‘మాదాలరంగారావు సినిమాలంటే చిన్నప్పుడు ఎగిరిగంతేసి చూసేవాళ్ళం. లో క్లాస్ జీవితాలను సినిమాల్లో ప్రతిబింబించిన విధానం, మాట్లాడే మాటలు గుండెకు తగిలేలా ఉంటాయి. గరికపాటి రాజారావు తరహాలో ప్రజానాట్యమండలి, కళలు, నాటకాల ద్వారా ప్రజలకు వినోదాన్ని, ఆనందాన్నివ్వాలనుకున్నారు. ఆనందం కలగాలంటే తిండి కావాలి. అందుకు వ్యవసాయం ప్రధానం. అగ్రికల్చర్ లేనిదే కల్చర్ లేదంటారు. కళ ప్రజల కోసం అని కనిపెట్టిన వ్యక్తి గరికపాటి రాజారావు. ఆయనలాగే మాదాల రంగారావు కళను ప్రజల కోసం అన్నట్టుగా పనిచేశారు’ అని బ్రహ్మానందం తెలిపారు.
ఆర్.నారాయణమూర్తి చెబుతూ, ‘తండ్రి గొప్పతనాన్ని ప్రజలందరికి తెలిసేలా చేసిన ఆయన తనయుడు రవికి సెల్యూట్. రంగారావుపై పాట రాసిన, పాడిన వారికి వందనాలు. కమ్యూనిస్టులకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయడం లేదో అర్థం కావడం లేదని బ్రహ్మానందం అన్నారు. ఎర్రజెండాలు చీలితే ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు. కమ్యూనిస్టులంతా కలిస్తే ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కలిసి కట్టుగా పోరాటాలు చేయమంటున్నారు. ప్రజలను దోచుకునేవారు, అవినీతికి పాల్పడే వారు ఎలాగైతే ద్రోహులో, కమ్యూనిస్టులంతా కలవకపోవడం వల్ల మనం వారికంటే పెద్ద ద్రోహులమవుతున్నాం. ఏకమైతే మంచిది’ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్శదర్శి చాడా వెంకట్ రెడ్డి, ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, ఎం.శ్రీనివాస్, సీపీఐ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, గుండా మల్లేష్, విమలక్క, టీడీపీ నాయకుడు ఎల్.రమణ, సినీ ప్రముఖలు తమ్మారెడ్డి భరద్వాజ, ధవళసత్యం, మలినేని గోపీచంద్, భీమనేని శ్రీనివాసరావు, గౌతంరాజు, పి.సి.ఆదిత్య, రేలంగి నర్సింహారావు, బి.గోపాల్, పోకూరి బాబురావు, భగవాన్, పుల్లారావు, వందేమాతరం శ్రీనివాస్, ఆర్పీ పట్నాయక్, శ్రీలేఖ, బెల్లంకొండ సురేష్, శివారెడ్డి, మద్దినేని రమేష్, ఉమామహేశ్వరరావు, అరుణోదయ రామారావు, ప్రసన్నకుమార్, బెనర్జీ, సి.వి.రెడ్డి, కవిత, చలసాని శ్రీనివాస్, రాంప్రసాద్, త్రిపురనేని చిట్టి, కొమరవెంకటేష్, సావిత్రి అల్లుడు గోవిందరావు తదితరులు పాల్గొని మాదాల రంగారావు చేసిన సేవలను కొనియాడారు.