కృష్ణంరాజు 80వ పుట్టిన రోజుని పురస్కరించుకుని హైదరాబాద్ లో బర్త్ డే సెలబ్రేషన్స్
జరిగాయి. ఈనెల 20న ఆయన జన్మదినం. రెండు రోజుల ముందుగానే శనివారం హైదరాబాద్ ఎఫ్ ఎన్ సి సి లో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. పలు విజయవంతమైన చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి, రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకోవడమే కాక, నిర్మాతగానూ హిట్ చిత్రాలు నిర్మించారు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు. సతీసమేతంగా హాజరైన కృష్ణంరాజు కేక్ కట్ చేసి తన ఆనందాన్నిపంచుకున్నారు.
కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘సినీ జర్నలిస్టు విశ్లేషణ నటీనటుల భవిష్యత్తు, ఎదుగుదలకి ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి ఎందరో గొప్ప జర్నలిస్టు నాకు మంచి అనుబంధం ఉంది. అందరికీ ఏదో ఒక వ్యసనం ఉంటుంది. నాకు స్నేహితులను చేసుకునే వ్యసనంఉంది. ఫ్రెండ్స్ ని చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. మా నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ఆ బేనర్ లో అనేక గొప్ప సినిమాలను నిర్మించి, నటించాను. ‘బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి’, ‘అమర దీపం’,
‘మనవూరి పాండవులు’ వంటి చిత్రాలు చేశా. ‘తాండ్రపాపారాయుడు’ చిత్ర సమయంలో ఐదువేల
మందితో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించాం. క్లిష్ట పరిస్థితుల్లో అంత మందితో చిత్రీకరించడంతో నా
బలం, నాలోని శక్తి ఏంటో తెలిసింది. అది చూసి ఎంతో ఆనంద పడ్డాను.
మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. ఇప్పుడు మా నుంచి రాబోతున్న ప్రభాస్ కొత్త చిత్రాన్ని ఈ అంచనాలకు తగ్గట్లుగానే రూపొందిస్తున్నాం. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. మరో మూడు నెలల పాటు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తాం. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ‘గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు’.. అంటుంటారు కదా. ప్రభాస్ కూడా అలాంటి వాడే. నేను హీరోగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సీమల్లో గుర్తింపు తెచ్చుకున్నా. కానీ, ప్రభాస్ ఏకంగా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని, అభిమాన గణాన్ని సృష్టించుకున్నాడు. నేనూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నా..
ప్రతి తండ్రి తన కొడుకు ఎదగాలని కోరుకుంటాడు.. తప్ప తన తనయుడి చేతిలో ఓడిపోవాలని కోరుకోరు. నేనూ అంతే. ఈ కృష్ణంరాజు ఎప్పుడూ ఓటమిని అంగీకరించడు (నవ్వుతూ). ఎందుకంటే ఓటమన్నది నా జీవితంలోనే లేదు.
ఇక రాజకీయాల విషయానికొస్తే.. ఇప్పటికైతే రాజకీయంగా నాకంటూ సొంత ఉద్దేశాలు లేవు. పార్టీ పెరిగితే నేను పెరిగినట్లే. వాజ్‌పేయి ప్రభుత్వం హీరోగా ఉన్న నన్ను కేబినెట్ మంత్రిని చేసింది. వాళ్లు నాకిచ్చిన ఈ గౌరవాన్ని నేనూ నిలబెట్టుకున్నా. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భాజపాతో పొత్తు పెట్టుకోవడాన్ని స్వాగతిస్తున్నా. ఇది శుభపరిణామం. సిద్ధాంతాలు కలుపుకొని, ప్రజలకు సేవ చేయాలని అనుకున్నంత కాలం ప్రజలకు అంతా మంచే జరుగుతుంది’’ అన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కృష్ణంరాజుని ప్రత్యేకంగా సత్కరించింది. అసోసియేషన్‌కి తమ వంతు సహకారం అందిస్తామని కృష్ణంరాజు హామీ ఇచ్చారు.