బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెలుగులో ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమా ఒప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అమితాబ్ దక్షిణాదిన ఓ సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఈ సినిమాలో అమితాబ్ నటిస్తున్నట్లు తెలిసినప్పుడు ప్రేక్షకులకు నమ్మకం కలుగలేదు. కానీ ఇటీవల అమితాబ్ హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు ‘సైరా…’ షూటింగ్లో పాల్గొని వెళ్లాడు. ఇంతటితో ఆయన పార్ట్ పూర్తయింది. ఈ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను అమితాబ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బి తొందరపడి ఫొటోలు లీక్ చేశాడేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ‘సైరా..’ టీమ్ ఉద్దేశపూర్వకంగానే అమితాబ్ ద్వారా ఈ ఫొటోలను షేర్ చేయించిందన్న విషయం ఆతర్వాత అర్థమైంది.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ రూపొందిస్తున్నారు. ‘బాహుబలి’ తరహాలో ఇండియా అంతటా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది చిత్ర బృందం ప్లాన్. అందుకే చిన్న పాత్రే అయినా అమితాబ్‌తో చేయించారు. బాలీవుడ్‌కు చెందిన అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే ఈ చిత్రానికి ముందు నుంచే ప్రచారం కల్పించడం కోసం అమితాబ్ ద్వారా ఆన్‌లొకేషన్ స్టిల్స్ రిలీజ్ చేయించారు. బిగ్ బికి సోషల్ మీడియాలో కోట్లల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఒక ట్వీట్ చేస్తే వచ్చే ప్రచారమే వేరు. ‘సైరా’ కోసం ఆయన పనిచేసింది రెండు రోజులే అయినా… అమితాబ్‌కు కోట్లల్లో పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఇది ఆయన నటన కోసం ఇస్తున్నది కాదు… ఆయన జాతీయ స్థాయిలో చేసి పెట్టే ప్రచారానికి ఇస్తున్న పారితోషికం అన్నమాట. సినిమా విడుదలకు ముందు మరింతగా అమితాబ్ ప్రచార సేవల్ని ఉపయోగించుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది.