సినీవినోదం రేటింగ్ : 2/5
శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విక్రమ్ సిరికొండ దర్శకత్వం లో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు
పాండిచ్చేరిలో నివసించే కార్తికేయ ఇండస్ట్రీస్ అధినేత కార్తికేయ (రవితేజ) కి కుటుంబం అంటే చాలా ప్రేమ. కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని చేయకూడదని అనుకునే స్వభావం ఉన్న వ్యక్తి. రవితేజ తండ్రి( జయప్రకాష్)కి కొడుకు పెళ్లి చేసుకోవడం లేదనే బాధ ఉంటుంది. తండ్రి బాధను చూడలేక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు రవితేజ. అందుకోసం పుష్ప(రాశిఖన్నా)ను పెళ్లి చూపుల్లో చూస్తాడు.అనుకోకుండా పుష్పను రెండు సార్లు హర్ట్ చేస్తాడు. దాంతో పుష్ప.. కార్తికేయను పెళ్లి చేసుకోనని చెబుతుంది కానీ , ప్రేమ ఉంటుంది. ఆ కారణంగానే అతనికి వేరే అమ్మాయితో జరిగే పెళ్లి సంబంధాన్ని కూడా అడ్డుకుంటుంది.అది తెలిసి కార్తికేయ ఆమెతో పెళ్లిని నిరాకరిస్తాడు. మరోవైపు కార్తీకేయ కంపెనీకి వచ్చే మిషనరీస్‌ను సెల్వమ్ అనే గూండా లాక్కెళ్లిపోతాడు. ఈ విషయమై కార్తికేయ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు. పోలీసులు సమస్యను పట్టించుకోవడం లేదని కార్తికేయ పవర్ ఏంటో చూపిస్తాడు. అదే సమయంలో కార్తికేయ కంపెనీలో పనిచేసే వ్యక్తి కొడుకు సత్యను ఎవరో హత్య చేస్తారు. ఆ హత్యను కార్తికేయ చెల్లెలు చూసి చేసిన వ్యక్తిని ఇర్ఫాన్ లాలా గా గుర్తిస్తుంది. అప్పటికే చనిపోయిన ఇర్ఫాన్ ఎలా తిరిగి వచ్చాడు? గతంలో కార్తికేయకు, ఇర్ఫాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఇర్ఫాన్ చనిపోయాడని కమిషనర్ (మురళీశర్మ) ఎందుకు కార్తికేయకు అబద్ధం చెప్పాడు? ముజఫర్ పేట గొడవలు ఏంటి? అతన్ని అంతగా ఇష్టపడ్డ దివ్య (సీరత్ కపూర్) ఎందుకు అతన్ని వద్దనుకుంటుంది? అనే విషయాలు సినిమాలో చూడాలి …..
కొత్త కథ, అలరించే కథనం ఈ సినిమాలో లేకపోవడమే ప్రధాన బలహీనత. వక్కంతం రాసిన పాత చింతకాయ కథకి… దీపక్ రాజ్ ఊర స్క్రీన్‌ప్లే రాస్తే …దాన్ని కొత్త దర్శకుడు సినిమా గా మలిచాడు . దర్శకుడు విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి ఎలాంటి కొత్తదనం తెచ్చిపెట్టకపోగా, టేకింగ్ పరంగా కూడా పాతకాలపు పద్ధతులు పాటిస్తూ ఆసాంతం విసిగిస్తాడు. మొదటి అర్ధభాగాన్ని లవ్ ట్రాక్, కామెడీతో ఏదోలా నడిపిన దర్సకుడు సెకండాఫ్లో తేలిపోయాడు. కొత్తదనం చూపకపోగా కనీసం ఎంటర్టైన్మెంట్ నూ అందించలేకపోయారు. ఇంటర్వెల్ తర్వాత కాసేపు సినిమాని రవితేజ ముందుకు నడపాలని ప్రయత్నం చేసినా రొటీన్, బోరింగ్ కథనం ప్రేక్షకులకి నీరసాన్ని తెప్పిస్తుంది.
సినిమా ప్రారంభమైన ముప్పావు గంట వరకూ అసలు కథేమిటో క్లారిటీ రాకపోవడంతో అర్ధంలేని సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. అలాగే కథకు ప్రధానమైన ప్రతినాయకుడి పాత్రలో అస్సలు క్లారిటీ లేదు. ఆఖరులో పరుగులు పెట్టించే కథనంతో, ఎక్సయిట్‌మెంట్ పెంచే యాక్షన్‌తో సాగాల్సిన ఫ్లాష్‌బ్యాక్ కాస్తా… విషయ శూన్యంగా, కేవలం సన్నివేశాల కలబోతగా మాత్రమే కనిపిస్తుంది.అసంతృప్తిని కలిగిస్తుంది .
రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎనర్జీతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ ఒదిగిపోయారు. ఇక రాశి ఖన్నా స్లిమ్ అయి అందంగా వుంది. సీరత్ కపూర్ అందాల ప్రదర్శనకే పరిమితమైంది. జయప్రకాష్ తండ్రి పాత్రలో మెప్పించగా,వెన్నెల కిశోర్, మురళీ శర్మలు కామెడీతో కొంత నవ్వించారు . షాయాజీ షిండే, విలన్‌గా నటించిన ఫ్రిడే, రవితేజ స్నేహితుడిగా నటించిన సత్యం రాజేష్, అన్నపూర్ణ, సుహాసిని అంతా తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ప్రీతమ్ (జామ్ 8) వారు అందించిన పాటలు ఆకట్టుకోలేదు కానీ, మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది . చోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ , యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదు – రవళి