సినీవినోదం రేటింగ్ : 2/5
ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వి.ఐ.ఆనంద్ రచన,దర్శకత్వం లో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… అనాథ వాసు(రవితేజ)తనతో పాటు మరికొంత మంది అనాథలను చేరదీసి పెంచుతుంటాడు. వారు ఉంటున్న ఇల్లును కొనుక్కోవాలని అనుకుంటారు. దాని కోసం పాతిక లక్షల రూపాయలను పోగు చేస్తారు. అయితే ఆ డబ్బులు వేరొకరు దొంగలిస్తారు. ఆ డబ్బును వెతుక్కుంటూ వాసు గోవా వెళతాడు. అయితే వాసు లడక్‌లో చనిపోయి మంచు గడ్డల్లో కూరుకుపోతాడు. అతని శవాన్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్త ఆ శవంలోని అవయవాలు పాడు కాకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభుత్వానికి తెలియకుండా తాను చేస్తున్న ఓ ప్రయోగం ద్వారా ఆ శవానికి ప్రాణం పోస్తాడు. అయితే ప్రాణం వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఏవీ గుర్తుండవు. అతని గురించి తెలిసిన కొందరు వ్యక్తులు చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు వారికి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. డాక్టర్ల ప్రయోగం ద్వారా ప్రాణం పోసుకుంది వాసు కాదని.. 35 ఏళ్ల క్రితం చంపబడ్డ ‘డిస్కోరాజా’ అని. అసలు డిస్కోరాజా ఎవరు? అతన్ని 35 ఏళ్ల క్రితం ఎవరు చంపేసారు? మరి వాసు ఏమయ్యాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాలో చూడాలి…
విశ్లేషణ… రాజా అనే ఓ గ్యాంగ్‌స్టర్ .. ఆ డిస్కో రవితేజ చనిపోవడం.. అతని కొడుకు రవితేజ పై పగ సాధించడానికి వచ్చిన విలన్స్ భరతం పట్టడం ఈ సినిమా కథ. మామూలు రొటీన్ రివేంజ్ కథతో.. తెలుగు సినిమా ఎటు తిరిగినా పగ,ప్రతీకారం దగ్గరకు రావాల్సిందే అనేలా దర్శకుడు చేసాడు.అయితే దీనికి తండ్రి పాత్రలో1980 బ్యాక్‌డ్రాప్‌లో కాస్త టచింగ్ ఇవ్వడం..కొడుకు పాత్రను అనాథ గా చూపించి అతని చుట్టూ కథను నడిపిస్తారు. ముప్పయ్ అయిదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడు తిరిగి బతికి వస్తే ఎలాగుంటుంది? అనే ఆలోచన బాగుంది.. కానీ దాన్ని సినిమాగా మలిచే విషయంలో దర్శకుడు విఐ ఆనంద్ గందరగోళంలో పడ్డాడు. రవితేజ మార్కు ఎంటర్‌టైనర్‌గా మార్చాలనే ప్రయత్నంలో సినిమా పోయింది. డిస్కో రాజా కాలం నాటి కథలో ఎలాంటి ఆకర్షణీయమైన విషయం లేదు. హీరో, విలన్ మధ్య బలమైన ఘర్షణ వుండదు. చాలా సింపుల్‌గా విలన్ జైలు పాలు అయిపోవడంతో.. డిస్కో రాజా లైఫ్‌లోని లవ్ చాప్టర్ చూపిస్తారు. అతని మూగమ్మాయి ప్రేమాయణం చాలా రొటీన్ గా అనిపిస్తుంది. తర్వాత ఏమి జరుగుతుందనేది తెలిసిపోతూ.. నడిచే కథలో వచ్చే చివరి మలుపు కూడా ఎటువంటి ఆసక్తి కలిగించదు. ప్రేక్షకుడి సహనానికి సినిమా పరీక్ష పెడుతుంది. మరో సక్సెస్‌తో మళ్లీ లైంలైట్ లోకి రావాలని ఆశ పడిన రవితేజకి మరో సారి ఈ చిత్రంతో నిరాశ ఎదురయ్యింది.