హీరో కి కళ్ళు, సినిమాకి లాజిక్ లేని ….. ‘రాజా ది గ్రేట్‌’ చిత్ర సమీక్ష

                                           సినీవినోదం  రేటింగ్ : 2.5/5
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పతాకం పై అనిల్‌ రావిపూడి రచన దర్శకత్వం లో దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు .
 
నిజాయితీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్(ప్ర‌కాష్ రాజ్‌), పెద్ద గూండా దేవ‌రాజ్‌(వివాన్ బాట్నే)కు ఎదురు తిరిగి … అత‌ని త‌మ్ముణ్ని ఎన్‌కౌంట‌ర్‌లో చంపేస్తాడు. దాంతో ప్ర‌కాష్ రాజ్ టీంను దేవ‌రాజ్‌ చంపేస్తాడు. ప్ర‌కాష్ రాజ్ కుమార్తె ల‌క్కీ(మెహ‌రీన్‌)ను చంపాల‌ని చూస్తాడు. ల‌క్కీ త‌ప్పించుకుని డార్జిలింగ్‌కు వెళ్లిపోతుంది. ల‌క్కీకి స్పెష‌ల్ సెక్యూరిటీని అరెంజ్ చేయ‌డానికి ఐజీ(సంప‌త్‌) ఆలోచిస్తాడు. ఆ క్ర‌మంలో ముగ్గురు పోలీస్ ఆఫీస‌ర్స్‌ను అపాయింట్ చేస్తాడు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అనంత ల‌క్ష్మి(రాధిక‌)కు త‌న కొడుకు ‘రాజా ది గ్రేట్‌'(ర‌వితేజ‌)ని పోలీస్ ఆఫీస‌ర్ చేయాల‌ని పెద్ద కోరిక ఉంటుంది. అయితే రాజా అంధుడు కావ‌డంతో పోలీసులు ఆమెకోరిక తిర‌స్క‌రిస్తుంటారు. రాజా అంధుడైన‌ప్ప‌టికీ స్పెష‌ల్ ట్ర‌యినింగ్ తీసుకోవ‌డం వ‌ల్ల చాలా చురుకుగా ఉండ‌ట‌మే కాకుండా, చూపుండేవారు కూడా చేయ‌లేని ప‌నుల‌ను చేసేస్తుంటాడు. అనంత ల‌క్ష్మి పోరు ప‌డ‌లేక ఐజీ, రాజాను ల‌క్కీని కాపాడే టీంలో భాగం చేస్తాడు. ల‌క్కీ డార్జిలింగ్‌లో ఉంద‌ని తెలుసుకున్న దేవ‌రాజ్ అక్క‌డి త‌న మ‌నుషుల‌ను పంపుతాడు. కానీ రాజా ఆమెను కాపాడుతాడు. అంతే కాకుండా భ‌యంతో పారిపోకుండా .. ఫైట్ చేద్దామ‌ని ల‌క్కీకి ధైర్య‌మిస్తాడు. రాజా ఇచ్చిన ధైర్యంతో ల‌క్కీ త‌న ఊరికి వ‌స్తుంది? అప్పుడు ఆమె ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది? ల‌క్కీని చంప‌డానికి దేవ‌రాజ్ ఏం చేస్తాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే….
 
 
దర్శకుడు అనిల్ మొదటి నుండి నమ్ముకున్న ఎంటర్టైన్మెంట్ నే ఈ సినిమాలో కూడా చూపించి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసాడు. సినిమాలో కొద్ది పాటి కథ మాత్రమే ఉండటం … అది కూడా రొటీన్ కథే అయ్యుండటం తో నిరుత్సాహాన్ని కలిగించింది. సినిమా మొదటి అరగంటలోనే కథ మొత్తం రివీల్ అయిపోవడంతో ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో సులభంగా ఊహించెయొచ్చు. దీంతో ఎంటర్టైన్మెంట్ తప్ప ఎగ్జైట్మెంట్ ఎక్కడా లేదు. తొలి అర్థభాగం ఫుల్ ఎంటర్ టైనింగ్ గా నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో కధ నెమ్మదించి బోర్ కొట్టించాడు .హీరో ని సగటు మాస్‌ కథానాయకుడి పాత్రలా కాకుండా ‘గ్రేట్‌’ అనిపించేలా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. సగటు కమర్షియల్‌ హీరోకి, చూపులేని రాజాకీ మధ్య గీత గీయకుండా వదిలేశాడు .రెగ్యులర్‌ మాస్‌ హీరోకి, ఈ రాజాకీ తేడాయే లేదు. హీరో అవడానికి అంధుడైనా కానీ ఎందులోనూ తీసిపోడు. డిజైనర్‌ బట్టలేసుకుని తిరుగుతాడు, లయ తప్పకుండా డాన్స్‌ చేస్తాడు, తడబడకుండా నడిచేస్తాడు, ఎంతమంది వచ్చినా నరికేస్తాడు. ఎన్ని వందల మంది వచ్చినా హీరో వారిని వెలుగులో అయినా, చీకట్లో అయినా ఉతికి ఆరేస్తాడు. ఎలా అంటే … నేను ‘బ్లయిండ్‌’ కానీ ‘ట్రెయిన్డ్‌’ అని అంటాడు . యాక్షన్‌ పార్ట్‌ మొత్తం ఇలాంటి అసంబద్ధమైన, అసహజమైన సన్నివేశాలతో నిండిపోయినా …. హాస్య సన్నివేశాలు కొన్ని బాగా పండడం మాత్రం రిలీఫ్‌. ముఖ్యంగా పోసాని, హరితేజ తదితరులపై తీసిన ఎపిసోడ్‌ నవ్విస్తుంది. కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ బాగా డీల్‌ చేసాడు. కాకపోతే ఇలాంటి కథకి చాలా అవసరమైన ఎమోషన్‌ పూర్తిగా మిస్‌ అయ్యాడు. అలాగే యాక్షన్‌ పార్ట్‌లో లాజిక్‌ పూర్తిగా వదిలేసి, నేల విడిచి సాము చేసే సన్నివేశాలతో బ్లండర్‌ చేసాడు. కొత్తదనం చూపించడమంటే కేవలం హీరోకి ఓ వైకల్యం మాత్రం పెట్టి ఊరుకోకుండా, అందుకు తగ్గ ఆసక్తికరమైన కథనం కూడా జోడించి వుంటే ఈ రాజా నిజంగానే ‘గ్రేట్‌’ అనిపించుకునే వాడు.
 
 
అంధుడి పాత్ర‌లో ర‌వితేజ న‌ట‌న బావుంది.రెండేళ్ల తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, మరోసారి తన మాస్ అప్పీల్ కు డోకా లేదని ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ఫైట్ సీన్ స‌హా కీల‌కమైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ, ఎంట‌ర్‌టైన్మెంట్ స‌న్నివేశాల్లో ర‌వితేజ న‌ట‌న మెప్పించింది. మామూలు డైలాగ్స్ ని కూడా పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో చెప్పి మరింత నవ్వించగలిగాడు. ‘ఏమో సార్‌ నాకు కనపడదు’ అనే సింగిల్‌ డైలాగ్‌తో బ్యాంక్‌ రాబరీ సీన్‌లో రవితేజ మంచి హాస్యం పుట్టించాడు . మెహ‌రీన్ గ్లామ‌ర‌స్ నాయిక‌గా కాకుండా పొరుగింటి అమ్మాయిలాగా ముద్దుగా, బొద్దుగా క‌నిపించింది. ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచింది. విలన్ గా వివన్, రవితేజతో పోటి పడి అలరించాడు. రాక్షసుడిలా కనిపిస్తూనే కామెడీ పండించటంలోనూ సక్సెస్ అయ్యాడు. బుల్లితెర మీద హుందాగా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తున్న రాధిక ఇందులో మాత్రం మంచి ఎంటర్ టైనింగ్ పాత్ర లో అలరించింది. కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది. క్లైమాక్స్ లో రాధిక అనుభవం, నటన.. సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యేలా చేశాయి. బ్యాంక్ మేనేజ‌ర్‌గా పృథ్వి, డార్జిలింగ్ టీ ఎస్టేట్ ఓన‌ర్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆయ‌న త‌ల్లిగా అన్న‌పూర్ణ‌మ్మ‌, హీరోయిన్ బాబాయిలుగా పోసాని కృష్ణ‌ముర‌ళి అండ్ కో వారికి కేటాయించిన పాత్ర‌ల్లో బాగా చేశారు.హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి మరోసారి తనదైన నటనతో అలరించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, సంపత్, తనికెళ్ల భరణి తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
 
 
ఇక సంగీత దర్శకుడు సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా, పాటల్లో రెండు మాత్రమే బాగున్నాయి . మోహన్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. డార్జిలింగ్‌ అందాలని బాగా చూపించారు. త‌మ్మిరాజు ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్ కాస్త ట్రిమ్ చేసుండాల్సింది. అంధుడైన హీరో పాత్రకు లాజికల్ గా కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి – ధరణి