సినీవినోదం రేటింగ్ : 2 /5
మైత్రీ మూవీ మేకర్స్ శ‌్రీనువైట్ల దర్శకత్వం లో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్(సి.వి.ఎం) ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే …
అమెరికాలో ఫార్మాటికల్ కంపెనీ ఫిడోకు ఇద్దరు స్నేహితులు యజమానులుగా ఉంటారు. వారిని కుటుంబాలతో సహా రాజ్‌వీర్, విక్రమ్ తల్వార్, సాబు మీనన్, కరణ్ ఆరోరాలు చంపేసి ఆ కంపెనీన హస్తగతం చేసుకుంటారు. అయితే ఆ ఇద్దరి స్నేహితుల బిడ్డలు, వారి స్నేహితుడు జలాల్(షాయాజీ షిండే) బ్రతికిపోతారు. పద్నాలుగేళ్ల తర్వాత జైలు నుండి అమర్(రవితేజ) విడుదలవుతాడు. రాగానే రాజ్‌వీర్‌ను ప్లాన్ చేసి చంపేస్తాడు. దాంతో మిగిలిన ముగ్గురు ఓ పోలీస్ ఆఫీసర్ (అభిమన్యు సింగ్) సహాయం తీసుకుంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ హంతకుడిని వెతికే పనిలో ఉంటాడు. ఆ సమయంలోనే అమెరికాలోని వాటా అనే తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లారెడ్డి(జయప్రకాశ్ రెడ్డి) తెలుగు వారిని ప్రతి ఏటా పిలిచి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. అతని దగ్గరుండే వారిలో గండికోట(రఘుబాబు), మిర్యాల చంటి(వెన్నెలకిషోర్), కందుల(శ్రీనివాస్ రెడ్డి), చేతన్ శర్మ(గిరిధర్) ఆ ఈవెంట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. వీరిలో చేతన్ శర్మ చాలా మంచివాడు.అయితే మిగిలిన ముగ్గురు ఈవెంట్‌కు వచ్చిన తెలుగు వారి దగ్గర డబ్బులు వసూలు చేసి వారికి ఎలాంటి వసతులు కల్పించకుండా ఇబ్బందులు పెడుతుంటారు. ఆ ఈవెంట్‌కు వచ్చిన అక్బర్(రవితేజ) వారి ఆటలు కట్టిస్తాడు. ఆ ఈవెంట్ మేనేజర్ పూజను మిర్యాల చంటి ప్రేమిస్తాడు. అయితే పూజకు ఓ మానసిక రోగం ఉంటుంది. ఆ విషయం తెలిసిన మిర్యాల ఆమెను డాక్టర్ ఆంటోని(రవితేజ) దగ్గరకు తీసుకెళతాడు. ఆంటోని కూడా అక్బర్‌లా ఉండటంతో అందరూర కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆ సమయంలో అమర్, అక్బర్, ఆంటోనిలు ఒకరే అని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? అసలు అమర్.. అక్బర్, ఆంటోనిలా ఎందుకు బిహేవ్ చేస్తుంటాడు? అమర్, పూజలు కలుసుకున్నారా? అమర్ తనకున్న మానసిక రోగాన్ని ఎలా అధిగమించి ప్రతీకారం తీర్చుకున్నాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ…
ఓ మామూలు రివేంజ్ డ్రామా కథకు రిచ్ గా న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు.దర్శకుడు శ్రీనువైట్ల ఈ కథలో కొత్తగా ఏమి చూపించాలనుకున్నాడో అర్థం కాదు. ‘అతనొక్కడే’ కాన్సెప్ట్‌కు ‘అపరిచితుడు’ మిక్స్ చేసి ఈ కథను తయారు చేసుకున్నాడు. సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉండవు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా.. చాలా సన్నివేశంలో కామెడీ కావాలని ఇరికించారన్న భావన కలుగుతుంది.కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం ఇంట్రస్టింగ్ గా సాగకపోవడం, కామెడీ కూడా పూర్తిగా ఆకట్టుకొనే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
నటీనటులు…
రవితేజ ఫుల్ ఎనర్జీతో అమర్, అక్బర్, ఆంటోని పాత్రలను విభిన్నంగా చేశాడు. పగ తీర్చుకునే అమర్.. పక్కవాడికి సహాయపడాలనుకునే అక్బర్… రోగులకు వైద్యం చేసే డాక్టర్ అంటోని పాత్రల్లో చక్కటి వేరియేషన్ కనపడుతుంది. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో అతని నటన చాలా బాగుంది. దర్శకుడు శ్రీనువైట్ల రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు పాత్రలను డిజైన్ చేశాడు. ఆరేళ్ల తర్వాత తెలుగు తెరపై సందడి చేసిన ఇలియానా బొద్దుగా కనపడింది.కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. డబ్బింగ్ బాగానే చెప్పింది. అయితే డాన్సు మూమెంట్స్ లో మాత్రం కొంచం ఇబ్బంది పడింది.ఇక తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, విక్రమ్‌జీత్ విర్క్ స్టైలిష్ విలన్లుగా కనిపించారు. విలక్షణ నటుడు షాయాజీ షిండేకు చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర దక్కింది. కామెడీ ట్రాక్ కోసం వెన్నెలకిషోర్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు తెలుగు అసోషియేషన్స మెంబర్స్‌గా చేసిన కామెడీ.. అప్పుల బాబీగా సునీల్ కామెడీ.. జూనియర్ పాల్‌గా సత్య కామెడీ… పర్వాలేదనిపిస్తుంది.
సాంకేతిక నిపుణులు…
సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు అంతగా లేవు. కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో అతను అందించిన నేపధ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక యమ్ అర్ వర్మ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. ఇంకా సాధ్యమైనంత ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి – రాజేష్