రాష్త్రేతర ప్రాంతాలలో నివశిస్తున్న తెలుగు ప్రజలకు, కవులకు కళాకారులకు వారి వారి ప్రాంతాలలోనూ మరియు తెలుగు రాష్ట్రాలలోనూ అవకాశాన్ని కలగ చేయటానికి రాష్త్రేతర తెలుగు సమాఖ్య గత రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. 2017 వ సంవత్సరం ప్రథమార్ధములో అనేక కార్యక్రమాలలో పాల్గొనడానికి మన రాష్రేతర తెలుగు వారికి అవకాశం కలిగింది.
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే నంది నాటక పొటీలలో రాతేస ప్రేరణపై విజయనగరం కేంద్రముగా జనవరి 18 నుంచీ ఫిబ్రవరి 15 వరకు రాష్త్రేతర ప్రాంతాల పది సమాజాలు మొట్టమొదటి సారి ప్రదర్శనలు ఇస్తున్నాయి.
2. మహారాష్త్రకు చెందిన తెలుగు వారి సమాఖ్య ఆతిథ్యములో రెండవ రాతేస వార్షిక ఉత్సవాలు ఏప్రిల్ 15-16, 2017 లలో జరుప బడతాయి.
3. తెలంగాణా ప్రభుత్వ ఆతిథ్యములో రాష్త్రేతర తెలుగు వారి కళా కౌశలాన్ని ప్రదర్శించే “భారతీయం” కార్యక్రమం 2016 మే నెల ఆఖరులో తొమ్మిది రాష్త్రాలు పాల్గొనటముతో ఘనముగా జరిగింది. 2017 లో కూడా “భారతీయం” కార్యక్రమ ప్రదర్శనకు మళ్ళీ ఆహ్వానించటం జరిగింది. రాతెస మరియు తెలంగాణా ప్రభుత్వాల ఉమ్మడి సమయం చూసి మే 2017 లో కార్యక్రమ సమయం నిర్ధారించబడుతుంది.
4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ద్వారా రాష్త్రేతర ప్రాంతాల సమగ్ర భాషా సాంస్కృతుల ఉత్సవం “అఖిల భారత సాంస్కృతీ మహొత్సవం” జరపడానికి తొమ్మిది రాష్ట్రాలకు చెందిన రాతేస మరియు ఇతర సంఘాల ఇరవై మంది ప్రతినిధులతో 27 జనవరి, 2017 రోజున విజయవాడ లో సమావేశం జరిగింది. శాసన మండలి ఉప సభాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ విజయభాస్కర్ గారి ఆధ్వర్యములో సమావేశము జరిగింది. ప్రతినిధులతో జరిగిన చర్చలలో 21-23 ఏప్రిల్,2017 లో మూడు రోజుల జాతీయ ఉత్సవం ఉదయం నుంచీ సాయంత్రం వరకు జరపాలని నిర్ణయించారు. ఉత్సవంలో రాష్ట్రేతర ప్రాంతాలలోని అరుదైన మరియు సంప్రదాయ సిద్ధమైన కళలు సంగీతం. నాట్యం, నాటకం మొదలైన కళలను ప్రదర్శించటమే కాక వివిధ సాహితీ సదస్సులు, భాషా స్థితిగతులు, ఇష్టా గోష్టులు, అష్టావధానాలు మొదలైన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆయా విషయాలపై అద్యయన సమాచారముతో ఒక సావనీర్, ఇతర పుస్తకాలు కూడా ప్రచురించడమవుతుంది. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశములోని అన్ని తెలుగు సంస్థలను ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి రాతేస చైర్మన్ శ్రీ పి.వి.పి.సి. ప్రసాద్ గారిని ముఖ్య సమన్వయ కర్త గానూ, శ్రీ ఆర్.సుందర రావు, శ్రీ వివిఎల్. శ్రీనివాస మూర్తి గార్లను సహ సమన్వయ కర్త గానూ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ సమన్వయ కర్తగా కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి డా. జీ.వీ. పూర్ణచంద్ వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్రాలకు వేర్వేరు ప్రతినిధులను ఎంపిక చేశారు. అన్ని సంఘాల ద్వారా ఫిబ్రవరి 20 లోపు వారి సూచిత కార్యక్రమాలను, ముఖ్య వ్యక్తుల వివరాలు పంపించాలి. ఎంపికైన కవుల, కళాకారుల బృందాలకు రాను పోను చార్జీలు, భోజన వసతి సౌకర్యాలనూ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
రాష్ట్రేతర ప్రాంతాలలో నివసిస్తున్న కవులు, కళాకారులు, వారి ఆసక్తిని, వివరాలను పంపిస్తే వీలుని బట్టి వారిని ముంబాయి ‘తెలుగు వెలుగు’ కార్యక్రమములో గానీ, తెలంగాణా వారి ‘భారతీయము’లో గానీ. ఆంధ్ర ప్రదేశ్ వారి సాంస్కృతిక ఉత్సవంలో గానీ అవకాశం ఇప్పించటానికి రాతేస శాయశక్తులా కృషి చేస్తుంది. వివరాలను వారి ప్రతినిధులకు గానీ లేక ముఖ్య సమన్వయకర్తకు గానీ, రాతేస ఈ -మైల్ కి గానీ పంప వలసింది. (ముఖ్య సమన్వయకర్త పీవీపీసీ ప్రసాద్, Ph. no: 09825114404 Email id: pvpcprasad@gmail.com or rashtretaratelugusamakhya@gmail.com)
వివిధ ప్రభుత్వాలు, సంస్థలు ఇస్తున్న ఈ సదవకాశాన్ని అన్ని సంస్థలు, కవులు, కళాకారులు పూర్తిగా ఉపయోగించుకుని, రాష్ట్రేతర తెలుగు వారి భాషా సంస్కృతుల అభిమానాన్ని , అంకిత భావాన్ని మరొక్కసారి చాటి చెప్ప ప్రార్థన.