నటి రష్మిక కర్నాటక సొంత గ్రామం ఇంటిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రష్మిక నివాసం నుంచి ఐటి అధికారులు 25 లక్షల నగదు, ఆస్తులకు సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రష్మిక మందన మంగళవారం ఐటి అధికారుల ముందు హాజరయ్యారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను రష్మిక తండ్రి ఐటి అధికారులకు చూపించలేకపోవడంతో… ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని నోటీసులు జారీ చేశారు. రష్మిక కూడా 1.5 కోట్లకు సంబందించి పన్ను చెల్లించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక తన తండ్రి మదన్, తల్లి సుమన్‌తో కలిసి మైసూర్‌లోని ఐటీ అధికారుల ముందు హాజరైయారు.
అతి తక్కువ వ్యవధిలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ నటి రష్మిక మందన్న. శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ.. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు చేయడం చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ నాయకులకు బినామీ
ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు చేయడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు చెబుతున్నారు. రష్మిక తండ్రి మదన్ మందన్న కాంగ్రెస్ నేత కావడం వల్లే ఈ దాడులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్మిక పేరు మీద 50 ఎకరాల కాఫీ తోటను కొనుగోలు చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కారణంతోనే.. ఈ దాడులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీమంత్రులు డీకే శివకుమార్, కేజే జార్జిలతో మందన్న కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న తండ్రి మదన్.. ఇదివరకు విరాజ్‌పేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పంచాయతీ సభ్యుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారని.. అవన్నీ కుమార్తె పేరు మీద బదలాయించారని చెబుతున్నారు. డీకే శివకుమార్ ఇంటి మీద ఇదివరకు దాడులు చేసిన సమయంలో మదన్ మందన్న వ్యవహారం తెర మీదికి వచ్చిందని అంటున్నారు.మదన్ మందన్న ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులకు బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
రష్మిక పేరు మీద 50 ఎకరాల కాఫీ తోట
రష్మిక స్వస్థలం విరాజ్‌పేట. కొడగు జిల్లాలో, కేరళ సరిహద్దులకు ఆనుకుని ఉండే ఈ చిన్న పట్టణం కాఫీ తోటలకు ప్రసిద్ధి. విరాజ్‌పేట శివార్లలో రష్మిక పేరు మీద ఇప్పటికే 50 ఎకరాల కాఫీ తోట ఉంది. తాజాగా- ఆమె పేరు మీదే మరో 50 ఎకరాల కాఫీ తోటను కొనుగోలు చేయడానికి ఆమె తండ్రి మదన్ మందన్న ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. మదన్ మందన్న పేరు మీద విరాజ్‌పేటలో సెరెనిటీ హాల్, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి.విరాజ్‌పేట సమీపంలోని గోణికొప్ర గ్రామంలో ఓ రెసిడెన్షియల్ స్కూల్‌ను నెలకొల్పడానికి రష్మిక తండ్రి ప్రయత్నిస్తున్నట్లు… దీనికోసం మూడెకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేసారని చెబుతున్నారు. సరిగ్గా మూడు నెలలల కిందటే రష్మిక ఆరు కోట్ల రూపాయల విలువ చేసే కారును కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులను ఆమె ఎలా కూడబెట్టారనే సందేహంతోనే ఐటీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.
రష్మిక మందన్న తొలి చిత్రం ‘కిరాక్ పార్టీ’. 2016 డిసెంబర్ 30న ఈ సినిమా కర్ణాటకలో విడుదలైంది. ఆ తరువాత ఆమె క్రమంగా స్టార్‌డమ్‌ను సంపాదించారు. ఈ మూడేళ్ల కాలంలో ఆమె నటించిన సినిమాల ద్వారా ఇంత భారీ ఆదాయం ఎలా సమకూరిందనే కోణంలో ఐటీ దాడులు చోటు చేసుకున్నట్లు సమాచారం.