‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘దేవదాస్’ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంది రష్మిక మందన. ప్రస్తుతం మరో క్రేజీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక నటించిన తాజా చిత్రం `గీతా .. ఛలో` ఈనెల 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దివాకర్ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్ – మూవీ మాక్స్ బ్యానర్లపై మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా అందిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. నేడు హైదరాబాద్ ఫిలింఛాంబర్ హాల్ లో థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ మాట్లాడుతూ –“రష్మిక మందన నటించిన మరో అద్భుత చిత్రమిది. ఏప్రిల్ 17న ఆడియో రిలీజ్ చేస్తాం. అటుపై ఏప్రిల్ 21న వైజాగ్ కళాభారతిలో ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈనెల 26న సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నాం. యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న క్రేజీ చిత్రమిది. వీకెండ్ పార్టీలు యువతరానికి మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే ఆసక్తికర పాయింట్ చుట్టూ కథాంశం తిరుగుతుంది. రష్మిక అందచందాలు, నటన మైమరిపిస్తాయి. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ప్రతిదీ ఆకట్టుకుంటాయి“ అని తెలిపారు.
సమర్పకుడు డైరెక్టర్ దివాకర్ మాట్లాడుతూ –“ఈ ఏడాది 100రోజులు గడిచాయి. 50 సినిమాలు రిలీజైతే సక్సెస్ 1శాతం మాత్రమే ఉంది. పరిశ్రమ స్లంప్ లో ఉంది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనర్ల పరిస్థితి అయోమయంలో ఉంది. పరిశ్రమకు మంచి హిట్ అవసరం. ఛలో, గీతగోవిందంతో చక్కని విజయాల్ని అందుకున్న రష్మిక ఈ చిత్రంతో మరో హిట్ అందుకోబోతోంది. ప్రచారం పరంగా వేగం పెంచుతున్నాం“ అన్నారు.
తుమ్మల పల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ-“సినిమా తీయడం కష్టం.. రిలీజ్ చేయడం ఇంకా కష్టం. దివాకర్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా అన్నిటా అనుభవజ్ఞుడు. నిర్మాతలు పంపిణీలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారు. ఆడియెన్ పల్స్ తెలిసి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ట్రైలర్ బావుంది. పెద్ద విజయం అందుకోవాలి“ అన్నారు.
ముత్యాల రామదాసు మాట్లాడుతూ-“ఈ టైటిల్ కావాలని పట్టు బట్టి మరీ ఎంపిక చేసుకున్నారు. రష్మిక స్పీడ్ ఈ సినిమాతోనూ కొనసాగాలి. నిర్మాతలకు పెద్ద విజయం దక్కాలి“ అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ-“ట్రైలర్ ఆకట్టుకుంది. రష్మిక కెరర్ కి మరో పెద్ద విజయం దక్కాలి. నిర్మాతలకు లాభాలు రావాలి“ అన్నారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ, జబర్ధస్త్ శేష్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్ కి విషెస్ అందించారు.