రానా దగ్గుబాటి ఇటీవల నటించిన హిందీ చిత్రం ‘హౌస్ఫుల్ 4’ బ్లాక్బస్టర్ హిట్టయింది.. ఇప్పుడు తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదలవుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2021 సంక్రాంతికి విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించింది.
పాతిక సంవత్సరాలుగా అరణ్యంలో జీవిస్తున్న ఒక మనిషి కథ ‘అరణ్య’. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభంపై దృష్టి పెడుతోంది. “ప్రాణాంతక మహమ్మారిపై పోరాడుతున్న మనం, స్ఫూర్తి కోసం మన అడవుల వంక దృష్టి సారించాలి. భూమికి ఊపిరితిత్తుల్లాంటి మన అరణ్యాలు.. అటవీ నిర్మూలన, పారిశ్రామికీకరణ పేరుతో విస్తరిస్తున్న మహమ్మారితో సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నాయి” అని దర్శకుడు చెప్పారు.
ఇందులో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ కీలక పాత్రలు పోషించారు. శంతను మొయిత్రా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్. మాటలు, పాటలు: వనమాలి, సౌండ్ డిజైన్: రసూల్ పోకుట్టి, ఎడిటింగ్: భువన్, ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ, నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభు సాల్మన్