ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. ఈ ఏడాది వరుసగా ‘ఘాజీ’, ‘బాహుబలి-2’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి చిత్రాలతో వరుస విజయాలను దక్కించుకున్న రానా ఖ్యాతి ఇప్పుడు ఖండాoతరాలు దాటబోతోంది. భల్లాలదేవ రానా త్వరలో అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ టాల్ హీరో ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.
గుజరాత్‌లోని పోర్ బందర్లో అంతుచిక్కని పరిస్థితుల్లో మునిగిపోయిన ఓ భారీ నౌకకు సంబంధించిన కథాంశంతో హాలీవుడ్లో తెరకెక్కబోతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట రానా. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ హాలీవుడ్ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందట. రానా ప్రస్తుతం బైలింగ్వల్‌గా రూపొందుతోన్న పీరియడ్ డ్రామా ‘మడై తిరందు’లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళంలో ధనుష్ ‘ఎనై నోకి పాయుమ్ తోట’ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు రానా. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్న రానా హాలీవుడ్లో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.