`అరణ్య’ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో నటిస్తోన్న `అరణ్య`ను ఈరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సహా.. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’ పేర్లతో ఏప్రిల్ 2న విడుదల చేస్తుంది.
దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ…“ఈ సినిమా రూపొందడానికి ముఖ్యకారణమైన వారిలో సురేష్‌బాబుగారు మొదటి వ్యక్తి. అలాగే తర్వాత రానాగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏనుగులతో ఒక లాంగ్వేజ్‌లోనే సినిమా చేయడం చాలా కష్టమైన పని. కానీ మూడు లాంగ్వేజెస్‌లో ముప్పై ఏనుగులతో సినిమా చేయడమంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఎంత కష్టమైన పనిని రానాగారు చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం తనని తాను అరణ్యగా మార్చుకున్నారు. తర్వాత విష్ణు విశాల్‌గారికి థ్యాంక్స్ .ఇదొక ఐకాన్ మూవీ అని చెప్పగలను. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. యూనిట్ సినిమా కోసం త్యాగం చేసింది“ అన్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు మాట్లాడుతూ…“ప్రభు తెరకెక్కించిన మైనా, కుంకి సినిమాలు చూశాను. ఆ రెండు సినిమాలు బాగా నచ్చాయి. ప్రభు నన్ను కలవడానికి వచ్చి నెరేట్ చేసినప్పుడు నాకు అవుట్ స్టాండింగ్‌గా అనిపించింది. ప్రభుగారి ఇమేజినేషన్, క్రియేటివిటీ నాకు బాగా నచ్చింది. ఓ వ్యక్తిగా ప్రకృతిని కాపాడుకోవాలనే తన తత్వం అభినందనీయం. ఇప్పటి సోసైటీకి ఎంతో అవసరమైన చిత్రం“ అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ… “రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని నిజ ఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. పద్మశ్రీ అవార్డ్ పొందిన ఈయన 1300 ఎకరాల అడవిని నాటాడు. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఆయన చేసిన పని వల్ల భూమి నది కోత నుండి పరిరక్షింపబడింది. అరణ్య సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. ప్రభుగారితో సినిమా చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. కథ విని నేను క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడానికి నాకు అరు నెలల సమయం పట్టింది. థాయ్‌లాండ్ షెడ్యూల్‌కి వెళ్లినప్పుడు నాకు అరణ్య పాత్రేంటో తెలిసింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభు సాల్మన్‌గారికి రుణపడి ఉంటాను. ప్రభుగారి టేకింగ్ వేరే రిథమ్‌లో ఉంటుంది. మనకు ఇచ్చిన డైలాగ్ పేపర్‌కి, సెట్స్‌కి వెళ్లేటప్పటికీ ఎంతో మార్పు ఉంటుంది. చాలా డీటెయిల్డ్‌గా తెరకెక్కించారు. వ్యక్తిగా, నటుడిగా చాలా విషయాలను నేర్చుకున్నాను. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది“అన్నారు.