ప్రేక్షక హింసే ప్రధానంగా… ‘వినయ విధేయ రామ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 1.5/5

డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
కధలోకి వెళ్తే…
న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా ప్రమాదం ఏర్ప‌డుతుంది. వారు చనిపోతామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఓ చిన్న‌పిల్లాడు ఏడుపు విన‌ప‌డుతుంది. ఆ ఏడుపు విన్న‌వారికి చ‌నిపోవాలనే ఆలోచ‌న పోయి.. బ్ర‌త‌కాల‌నుకుంటారు. త‌మ‌కు దొరికిన పిల్ల‌వాడికి రామ్ అనే పేరు పెడ‌తారు. అలా న‌లుగురు కాస్త ఐదుగురు అవుతారు. అన్న‌ల కోసం రామ్ త‌న చ‌దువు మానుకుని వారి చ‌దువు కోసం పాటు పడ‌తాడు. క్ర‌మంగా రామ్ స‌హా అంద‌రూ పెరిగి పెద్ద‌వుతారు. రామ్‌(రాంచ‌ర‌ణ్‌)కు దూకుడు ఎక్కువ‌. ఎక్క‌డ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటాడోన‌ని అత‌ని పెద్దన్న భువ‌న్ కుమార్(ప్ర‌శాంత్‌) .. ‘ఎవ‌రితో గొడ‌వ ప‌డొద్దు’ అంటూ మాట తీసుకుంటాడు. వైజాగ్‌లోని రామ్ అన్న‌య్య బై ఎలక్ష‌న్స్‌లో పందెం ప‌రుశురాం(ముఖేష్ రుషి) బావ మ‌రిది బ‌ల్లెం బ‌ల‌రాం(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎదురు నిలిచి ఎల‌క్ష‌న్స్ సజావుగా సాగేలా చూస్తాడు. భువ‌న్‌కు ఎదురు వవ్చిన ప‌రుశురాం మ‌నుషుల‌ను రామ్ చిత‌గ్గొడ‌తాడు. ప‌గ‌బ‌ట్టిన ప‌రుశురాం ఎస్పీ స‌హ‌కారంతో అంద‌రినీ ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకుంటాడు. అక్క‌డ‌కు రామ్ కూడా వ‌స్తాడు. అయితే అనుకోకుండా బీహ‌ర్ నుండి వ‌చ్చిన రాజుభాయ్‌(వివేక్ ఒబెరాయ్ ) మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌ని చూస్తే.. రామ్ అంద‌రినీ చంపేస్తాడు. బీహార్ ముఖ్య‌మంత్రి(మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్‌.పి రామ్ బ్యాగ్రౌండ్‌కు భ‌య‌ప‌డి పారిపోతాడు. ఇంత‌కు రామ్‌ను క‌ల‌వ‌డానికి బీహార్ ముఖ్య‌మంత్రి ఎందుకు వ‌స్తాడు? రాజు భాయ్‌కి, రామ్‌కు ఉన్న విరోధం ఏంటి? అస‌లు రాజుభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది? రామ్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ…
యాక్ష‌న్ ఎపిసోడ్స్ చేయ‌డానికి, భీభ‌త్సాన్ని తెర‌మీద ఓ స్థాయిలో చూపించ‌డానికి బోయ‌పాటి ఘ‌నాపాటి అనే విష‌యం ఈ చిత్రం ద్వారా మ‌రో సారి రుజువైంది. హీరో బ‌లాన్ని బాగా వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు.రామ్‌చ‌ర‌ణ్ హీరోయిజం అడుగ‌డుగునా ఎలివేట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్  బాగా తీసాడు కానీ …కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మీదే కాకుండా కథ- కథనం మీద కూడా ఇంకా దృష్టి పెట్టాల్సింది. ఓవరాల్ గా కొన్ని కొన్ని సీన్స్ లో రామ్ చరణ్ ని చూపిన విధానం, తన తో చెప్పించిన డైలాగ్స్, చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఇంతకు ముందు చూడలేదనే చెప్పాలి. అయితే హీరోను అంచనాలకు మించి చూపించే ప్రయత్నంలో ఏ మాత్రం నమ్మశక్యంగా లేని పోరాట సన్నివేశాలను డిజైన్‌ చేశారు. ఒక దశలో యాక్షన్‌ సీన్స్‌ మధ్యలో కథ వచ్చిపోతున్న భావన కలుగుతుంది.ఈ సినిమాలో కథే చాలా వీక్ గా ఉంటుంది. బేసిక్‌ స్టోరీ కూడా లేదు. ఒక రెండు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అనుకుని వాటి చుట్టూ అల్లుకున్న కథలాంటిది వుంది.ఈ కథని మనం ఇప్పటికి చాలా అంటే చాలా సార్లు చూసేసాం. పాత కథకి కొత్త ముఖాలు, కొత్త యాక్షన్ సీన్స్ మిక్స్ చేసి చెప్పినట్టుంటుంది.  చాలా సీన్స్ చూస్తున్నప్పుడు ఇలాంటి ‘సేమ్ టు సేమ్’ సీన్స్ బోయపాటి సినిమాలోనే చూసినట్టున్నాం అనే  ఫీలింగ్ వస్తుంది.
 
విలన్ కి ఓ భారీ ఫ్లాష్ బ్యాక్  చెప్పడం ..ఆ తర్వాత హీరో రాగానే రెండు ఫైట్స్ వెంట వెంటనే వచ్చి సినిమా అయిపోతుంది. చెప్పాలంటే ఒక ఫైట్ తోనే ఫినిష్ చేయచ్చు కానీ ఏదో సినిమా నిడివి కోసం, స్నేహ చేత రొటీన్ డైలాగ్స్ కొన్ని చెప్పించాలని ఇంకో క్లైమాక్స్ ఫైట్ పెట్టినట్టుంటుంది. కనల్ కణ్ణన్ యాక్షన్ డిజైనింగ్ బాగుంది కానీ …కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్  సరిగా కట్ చేయలేదు, అందువల్ల చూసే ఆడియన్స్ కి ఊపొచ్చేలోపు ఫైట్ అయిపోతుంది. మొత్తం మీద అన్నివిధాలా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన చిత్రం ఇది.
నటవర్గం…
రామ్ చరణ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టుగా అనిపించినా.. నటుడిగానూ మంచి పరిణతి కనిపించింది. పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ డైలాగ్స్ తోనే కాకుండా సున్నితమైన ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనని కనబరిచాడు.  చరణ్ సిక్స్ ప్యాక్ , టాటూ లుక్ అభిమానులకి నచ్చుతుంది . పాటలు యావరేజ్ అయినప్పటికీ చరణ్ డాన్సులతో ఆకట్టుకున్నాడు . హీరోయిన్‌ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు.పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చరణ్  కియార కెమిస్ట్రీ బాగుంది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో బాగా చేసింది.వదిన పాత్రలో  హుందాగా కనిపించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో ఆమె నటన బాగుంది. హీరోని ఢీ కొట్టే విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్  వివేక్ ఒబెరాయ్ పెర్ఫార్మన్స్ మంచి స్థాయిలో ఉండడం వల్ల రామ్ చరణ్  వివేక్ ఒబెరాయ్ మధ్య సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి, హరీష్ ఉత్తమన్‌, రవి వర్మ, మధునందన్‌, ప్రియదర్శన్ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు.
సాంకేతికంగా…
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా ఆకట్టుకోలేకపోయాడు.ఒక‌ట్రెండు సాంగ్స్ మిన‌హా మిగిలిన పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే. రిషి పంజాబి, ఆర్థర్‌ ఏ. విల్సన్‌ తమ సినిమాటోగ్రఫితో సినిమాను కాపాడే ప్రయత్నం చేశారు. ఎలివేషన్‌ షాట్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది.ఎం రత్నం రాసిన మాటలు,ఎఎస్ ప్రకాష్ సెట్స్ బాగున్నాయి. ముఖ్యంగా పాటలకి వేసిన సెట్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు ఎడిటింగ్ అంత బాగా లేదు. నిర్మాణ విలువలు రామచరణ్, బోయపాటి స్థాయిలో భారీగా ఉన్నాయి – రాజేష్