రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. ‘రంగస్థలం’ ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో శతదినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా వంద రోజులు ఆడిందంటే.. దాని వెనుక చాలామంది కృషి, కష్టం ఉన్నాయి. సినిమా అనేది ఒకరి ఆలోచన నుంచే మొదలవుతుంది. అతనే దర్శకుడు. సుకుమార్ ఎప్పుడైతే పెన్ను పట్టుకున్నారో.. అప్పుడే ‘రంగస్థలం’ అనే గొప్ప కథ మొదలైంది. దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, నేనూ… నాతో పాటు ఇంతమంది కలసి ఇలా పనిచేశామంటే అదంతా సుకుమార్ ఆలోచన వల్లే. అదే ఈ సినిమాను వంద రోజుల వరకూ తీసుకొచ్చింది. అందుకు సుక్కుకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. దేవి పాటలకు డ్యాన్స్ చేయడం ఓ సవాల్. నాతో కష్టపడి నాతో డ్యాన్సులు చేయిస్తుంటారు మా డ్యాన్సు మాస్టర్లు. సమంత బాగా నటించింది. రంగమత్త పాత్రని అనసూయ చాలా బాగా పోషించింది. ఏ విషయమైనా మన తల్లి దండ్రుల నుంచీ గురువుల నుంచి నేర్చుకుంటుంటాం. మా నాన్న నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ‘ఖైది నెం 150’తో ఆయన పునరాగమనం చేశారు. ఆసమయంలో ఆయన్ని బాగా గమనించా. ఆయన కష్టం చూస్తే ఉత్తినే ఓ వ్యక్తిపై ఇంత ప్రేమ ఎందుకు వస్తుంది? కేవలం మంచి సినిమాల వల్ల, పాత్రల వల్ల రాదనిపించింది. నిర్మాతలు, పంపిణీదారులు సంతోషంగా ఉంటే మేమంతా బాగుంటాం. ఇక నుంచి వచ్చే ప్రతి సినిమా బాగా ఆడాలి. పరిశ్రమ బాగుండాలి’’ అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ ‘‘ఈ కథ విన్న వెంటనే ‘ఓకే’ అనకపోతే రామ్‌చరణ్‌కి మరో కథ వినిపించేవాణ్ని. ‘రంగస్థలం’ ఇలా వచ్చిందంటే మూల కారణం రామ్‌చరణ్. నిర్మాతలు నవీన్, రవి, మోహన్ సహకారం మర్చిపోలేను. రత్నవేలు నా విజన్. తను లేకపోతే నాకు విజువల్స్ లేవు. నా ఆత్మ.. దేవిశ్రీ ప్రసాద్. చరణ్‌తో మళ్లీ ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నా. చరణ్‌తో విరామం తట్టుకోలేకపోతున్నా’’ అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన నవీన్ మాట్లాడుతూ ‘‘ఈ రోజుల్లో వంద అనేది ఉందా? ఇలాంటి పరిస్థితిలో వంద రోజుల సినిమా ఇచ్చినందుకు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, మోహన్, రవి, సుస్మిత, రామకృష్ణ, నరేష్, బ్రహ్మాజీ, అనసూయ, జానీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.