బాలీవుడ్ ప్రయత్నాలు మానుకోను. మంచి కథ దొరికితే తప్పకుండా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తానని, ఫలితం గురించి ఆలోచించకుండా చేస్తున్న పని కోసం వందకు వంద శాతం కష్టపడతానంటున్నారు ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్. ప్రస్తుతం ‘రంగస్థలం’తో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్ గురించి ముచ్చటించారు. బాలీవుడ్ ఎంట్రీ ‘జంజీర్’ అపజయం గురించి కూడా వివరణ ఇచ్చారు. ఐదేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా ‘జంజీర్’(తెలుగులో ‘తుఫాను’) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని మిగిల్చింది.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘జంజీర్’ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాను. ఎందుకంటే బాలీవుడ్లో అది నా తొలి చిత్రం. మనస్ఫూర్తిగా నమ్మి, వంద శాతం కష్టపడి చేసిన సినిమా అది. కానీ నా అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. ఫలితం నాకు నిరాశ కలిగించిన మాట వాస్తవమే. ఆ సినిమా విజయం సాధించలేదని చెప్పి బాలీవుడ్ ప్రయత్నాలు మానుకోను. మంచి కథ దొరికితే తప్పకుండా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తాన’ని తెలిపారు.ప్రియాంక చోప్రాతో నటించడం గురించి చెబుతూ… ‘ప్రియాంక చాలా అందమైన, ప్రతిభ గల నటి. సినిమా అంటే ఆమెకు చాలా ఇష్టం. వృత్తికి పూర్తిగా అంకితమవుతారు. మరోసారి ఆమెతో నటించాలనుకుంటు’న్నాను అన్నారు.
ప్రియాంక ప్రస్తుతం హలీవుడ్లో నటిస్తున్నారు కదా, మీరు ఆ వైపు వెళ్లే ఆలోచనలు ఉన్నాయా? అని అడిగితే…. ‘తెలుగు పరిశ్రమలో నేను చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. నేను ఎప్పుడు ‘ఫలానా సినిమాలు చేయాలి’ అని అనుకోలేదు. అలానే, ‘హలీవుడ్‌కి వెళ్లాలి’ అని కూడా అనుకోలేదు. నాకు నప్పే కథలతోనే నా ప్రయాణం సాగుతుంది. అంతేకాని, ప్రణాళికలు వేసుకుని పనిచేయడం నాకు చేతకాదు. నేను చేసే ఏ సినిమాకైనా వందశాతం పూర్తిగా కష్టపడతాను. కానీ ఫలితం మన చేతిలో ఉండదు కదా’ అన్నారు.ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్‌కు జోడిగా కైరా అద్వానీ నటించనుండగా, మిగతా పాత్రల్లో వివేక్ ఓబెరాయ్, స్నేహ, ఆర్యన్ రాజేష్‌లు నటిస్తున్నారు.